Shane Warne: థాయ్‌లాండ్‌కు వెళ్లకముందే షేన్‌వార్న్‌కు ఛాతిలో నొప్పి

లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ విశ్రాంతి కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లకముందే ఛాతిలో నొప్పి వస్తుందని, తనకు చెమటలు పడుతున్నాయని చెప్పాడని ఆయన మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ వెల్లడించారు...

Published : 08 Mar 2022 01:03 IST

మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కైన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ విశ్రాంతి కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లకముందే ఛాతిలో నొప్పి వస్తోందని, తనకు చెమటలు పడుతున్నాయని చెప్పాడని ఆయన మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ వెల్లడించారు. వార్న్‌ గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు విల్లాలో గుండెపోటుతో మృతిచెందాడని పోలీసులు  అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మేనేజర్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాలు చెప్పాడు.

‘షేన్‌వార్న్‌ ఇంతకుముందు కూడా ఇలాగే పలుమార్లు ఏవేవో డైటింగ్‌లు చేశాడు. దీంతో 14 రోజుల పాటు కేవలం ద్రవ పదార్థాలనే తీసుకున్నాడు. ఆ సమయంలో పలు రకాల జ్యూస్‌లు కూడా తాగేవాడు. మరోవైపు అతడు ఎల్లప్పుడూ ధూమపానం కూడా చేసేవాడు. అయితే, ఇప్పుడెలా చనిపోయాడో నాకు తెలియదు. నేనైతే గుండెపోటుతోనే మృతిచెంది ఉంటాడని భావిస్తున్నా. అదే జరిగి ఉండొవచ్చు. ఆస్ట్రేలియా నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లేముందు ఛాతిలో నొప్పి ఉందని, చెమటలు పడుతున్నాయని కూడా చెప్పాడు’ అని మేనేజర్‌ పేర్కొన్నాడు. ఇటీవల వార్న్‌ సైతం ఇదే విషయంపై ఓ డాక్టర్‌ను సంప్రదించాడని థాయ్‌లాండ్‌ పోలీసులు తెలిపారు.

మరోవైపు షేన్‌వార్న్‌ కుటుంబ సభ్యులు కూడా అతడికున్న ఆరోగ్య సమస్యలు, ఆస్థమా వంటి విషయాలపై థాయ్‌లాండ్‌ పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చారని తెలిసింది. ఇక వార్న్‌ అచేతనంగా పడి ఉన్న సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లేముందు ఏం జరిగిందనే విషయాన్ని పారామెడిక్‌ (అత్యవసర సమయంలో చికిత్స అందించే వ్యక్తి) మీడియాకు చెప్పాడు. ‘ఆ సమయంలో వార్న్‌ స్నేహితులు చాలా కంగారు పడ్డారు. తొలుత సీపీఆర్‌ నిర్వహించి అతడికి శ్వాస అందించేందుకు ప్రయత్నించారు. తర్వాత నేను సీపీఆర్‌ నిర్వహిస్తుంటే వాళ్లు భయపడి ఏడుస్తున్నారు. ఒకతను కమాన్‌ షేన్‌, కమాన్‌ షేన్‌ అంటూ పిలిచాడు’ అని పారామెడిక్‌ వివరించాడు. కాగా, తాను అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ పార్టీ చేసుకున్న ఆనవాళ్లేవీ కనపడలేదని, మందు కానీ, సిగరెట్లు కానీ తాను చూడలేదని స్పష్టం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని