Shane Warne : టెస్టుల్లో 1000 వికెట్లుతీసే సత్తా వారిద్దరికే ఉంది: షేన్‌ వార్న్‌

ఇద్దరు స్పిన్నర్లకు మాత్రమే టెస్టుల్లో 1000 వికెట్లు తీయగల సత్తా ఉందని ...

Updated : 27 Jan 2022 07:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇద్దరు స్పిన్నర్లకు మాత్రమే టెస్టుల్లో 1000 వికెట్లు తీయగల సత్తా ఉందని ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌వార్న్‌ అభిప్రాయపడ్డాడు. అందులో ఒకరు టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ కాగా.. మరొకరు ఆసీస్‌కు చెందిన నాథన్‌ లయాన్‌ అని వార్న్ పేర్కొన్నాడు. ‘‘స్వదేశంలో అశ్విన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అందుకే కుంబ్లే రికార్డు సహా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్‌ (800) రికార్డు అధిగమించే అవకాశం ఉంది. అంతేకాకుండా టెస్టుల్లో వెయ్యి వికెట్లను పడగొట్టే సత్తా అశ్విన్‌ సొంతం’’ అని వివరించాడు.

 ప్రస్తుతం అశ్విన్‌ 430, లియాన్‌ 415 వికెట్లతో ఉన్నారు. భారత టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌ అశ్వినే. అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434) మాత్రమే ముందున్నారు. ‘‘ అశ్విన్‌, లియాన్‌ ఇద్దరూ నాతోపాటు ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొడతారని ఆశిస్తున్నా. నాణ్యమైన స్పిన్‌ను చూస్తుంటే తప్పకుండా సాధిస్తారనే నమ్మకం ఉంది. ఇది టెస్టు క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఫాస్ట్‌బౌలర్‌-బ్యాటర్‌ ఫైట్‌ కంటే స్పిన్నర్‌తో బ్యాటర్‌ పోరాటం ఎక్కువ మంది చూస్తారని అనుకుంటా. ఒకవేళ అశ్విన్‌, లియాన్ వెయ్యి వికెట్లను పడగొడితే టెస్టు క్రికెట్‌ ఇంకా ఎంతో ఆసక్తిగా మారుతుంది’’ అని తెలిపాడు. 

అశ్విన్‌ బౌలింగ్‌కు తానొక అతిపెద్ద అభిమానిని అని వార్న్‌ పేర్కొన్నాడు. ‘‘రవిచంద్రన్ అశ్విన్‌ రోజురోజుకూ మెరుగవుతున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎలాంటి క్రికెటర్‌కైనా అసలైన పరీక్ష విదేశాల్లో ఎలా రాణించారనేది చూస్తారు. సుదీర్ఘకాలం కెరీర్‌లో స్వదేశం సహా విదేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డును కలిగి ఉన్నాడా లేదా అనేదే పరిశీలిస్తారు. నేను అశ్విన్‌కు పెద్ద అభిమానిని. విభిన్నంగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు’’ అని షేన్‌ వార్న్‌ విశ్లేషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని