టాప్‌-5 టెస్టు బ్యాటర్లతో షేన్‌ వార్న్‌ జాబితా‌.. టీమ్‌ఇండియా నుంచి ఒకరికి స్థానం

ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో ఐదుగురు టాప్ బ్యాటర్లను ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌...

Published : 13 Dec 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో ఐదుగురు టాప్ బ్యాటర్లను ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ ఎంపిక చేసుకున్నాడు. ఆ జాబితాలో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నట్లు వార్న్‌ వెల్లడించాడు. మొదటి స్థానం మాత్రం ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు కేటాయించాడు. స్మిత్ తర్వాత ఇంగ్లాండ్ స్కిప్పర్ జో రూట్‌ ఉన్నాడు. మూడో స్థానంలో నిలకడకు మారుపేరైన కేన్‌ విలియమ్సన్‌ను ఎంచుకున్నాడు. ఐదో స్థానంలో మరో ఆసీస్‌ ఆటగాడు మార్నస్ లబుషేన్ నిలిచాడు. ‘‘ సుదీర్ఘకాలంగా అన్ని రకాల బౌలింగ్ దాడిని స్టీవ్‌ స్మిత్‌ ఎదుర్కొంటూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అందుకే స్మిత్‌కు టాప్‌ ర్యాంక్‌. తర్వాత రూట్‌ ఒకే క్యాలెండర్‌ సంవత్సరంలో ఆరు శతకాలు బాదాడు. కివీస్‌ సారథి కేన్ నిలకడకు మారుపేరు’’ అని వివరించాడు.  

నాలుగో స్థానం విరాట్ కోహ్లీకి, ఐదో స్థానం మార్నస్ లబుషేన్‌కు ఇవ్వడంపైనా షేన్‌ వార్న్‌ వివరణ ఇచ్చాడు. ‘‘విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా పెద్దగా రాణించలేదు. టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడు. అందుకే అతడికే నాలుగోస్థానం ఇచ్చా. అదే విధంగా ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ టాప్‌-5 లోకి వచ్చాడు’’ అని పేర్కొన్నాడు. విరాట్‌ నాలుగో స్థానం దక్కించుకోవడం మాత్రం అద్భుతమే. 2019, 2021 సంవత్సరాల్లో కనీసం ఒక్క మూడంకెల స్కోరును సాధించలేదు. అంతేకాకుండా టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోయాడు. తర్వాత వన్డే సారథ్యం నుంచి బీసీసీఐ తప్పించింది. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని