Shane Warne: మాయావీ.. నిను మరువం!

ఆటలో మాయలకు చోటుండకూడదు.కానీ లెగ్‌ సైడ్‌ పిచ్‌ అంచుల్లో పడ్డ బంతి ఆఫ్‌ స్టంప్‌ను లేపేస్తే అది మాయ కాక మరేంటి?ఆటలో మాంత్రికులను ఆడించకూడదు.కానీ క్రికెట్‌ బంతి స్పిన్‌ అయ్యే గరిష్ట పరిమితిని దాటి ఇంకో 50...

Updated : 05 Mar 2022 15:06 IST

ఈనాడు క్రీడావిభాగం

ఆటలో మాయలకు చోటుండకూడదు. కానీ లెగ్‌ సైడ్‌ పిచ్‌ అంచుల్లో పడ్డ బంతి ఆఫ్‌ స్టంప్‌ను లేపేస్తే అది మాయ కాక మరేంటి?ఆటలో మాంత్రికులను ఆడించకూడదు.కానీ క్రికెట్‌ బంతి స్పిన్‌ అయ్యే గరిష్ట పరిమితిని దాటి ఇంకో 50 శాతం ఎక్కువ బంతిని తిప్పేవాడు మాంత్రికుడు కాక మరేంటి? అవును.. అతను చేసేది మాయే.. అతను కచ్చితంగా ఓ మాంత్రికుడే! క్రికెట్‌ బంతితో ఇంకెవ్వరికీ సాధ్యం కాని విన్యాసాలెన్నో చేసి.. ఎప్పటికీ చెరిగిపోని, మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చూసుకున్నా తనివి తీరని జ్ఞాపకాలెన్నో ఇచ్చి.. క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న షేన్‌ వార్న్‌ ఇక లేడు. అతడి బంతులు ఎంత అనూహ్యంగా గింగిరాలు తిరిగి బ్యాట్స్‌మెన్‌ను షాక్‌లోకి నెట్టేవో.. ఇప్పుడు అతనూ అంతే అనూహ్యంగా, హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపోయి అభిమానులను షాక్‌లో ముంచేశాడు వార్న్‌.

ట అందరూ ఆడతారు. కానీ ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టి ఆటకే వన్నె తెచ్చేవాళ్లు కొద్దిమందే ఉంటారు. అలాంటి అరుదైన ఆటగాడే వార్న్‌. లెగ్‌ స్పిన్‌ అనే నైపుణ్యాన్ని ఒక ‘కళ’గా మార్చిన ఘనత అతడికి చెందుతుంది.

ఈ తరం క్రికెట్‌ అభిమానులకు షేన్‌ వార్న్‌ పరిచయం లేకపోవచ్చు. అతడి ఆటను ప్రత్యక్ష ప్రసారంలో చూసి ఉండకపోవచ్చు. కానీ యూట్యూబ్‌లోకి వెళ్లి ‘బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ’ అని కొట్టి చూడండి. అలాగే ‘షేన్‌ వార్న్‌ బెస్ట్‌ బాల్స్‌’ అని టైప్‌ చేసి చూడండి. ఆ వీడియోల్లో ఒక్కటి చూస్తే చాలు.. మిగతావన్నీ అలా చూస్తూ చూస్తూ గంటలు గడిచిపోతాయి. బంతి బంతికీ నోరెళ్లబెడితే ఆశ్చర్యమేమీ లేదు. వార్న్‌ ఆట చూసిన వాళ్లయినా సరే.. ఇప్పుడు యూట్యూబ్‌ మీద పడితే పక్కకు రావడం అంత తేలిక కాదు. చూసిన బంతినే మళ్లీ మళ్లీ చూస్తూ పొందే ఆ అనుభూతిని మాటల్లో నిర్వచించడం సాధ్యం కాదు. క్రికెట్‌ అంటే పట్టని వాళ్లు కూడా ఒక్కసారి వార్న్‌ బౌలింగ్‌ చూస్తే ఆ మాయాజాలానికి ముగ్ధులు కాకుండా ఉండలేరు. అలాంటి కళాత్మకత వార్న్‌కే సాధ్యం!

స్పిన్నర్లకు నెలవైన ఉపఖండంలో స్పిన్‌ దిగ్గజాల జాబితా చాలా పెద్దదే. కానీ వాళ్లందరినీ మించే సొగసు వార్న్‌కే సొంతం అంటే అతిశయోక్తి కాదు. వార్న్‌ బౌలింగ్‌ను చూడబుద్ధేసినంతగా.. క్రికెట్‌ చరిత్రలోనే ఇంకెవరి బౌలింగ్‌ అనిపించదు అంటే.. క్రికెట్‌ పండితులు కూడా ఈ మాటను ఖండించలేరు. ఉపఖండ స్పిన్‌ దిగ్గజాలు కూడా ముచ్చటపడేలా ఆ కళను ఔపాసన పట్టి వాళ్లు కూడా నోరెళ్లబెట్టి చూసేలా బంతిని తిప్పిన ఘనుడు వార్న్‌. మురళీధరన్‌ వికెట్ల లెక్కల్లో వార్న్‌ను మించి ఉండొచ్చు. కానీ అతడిలా మోచేతిలోని లోపం వార్న్‌కు వరంగా రాలేదు. బౌలింగ్‌ పరంగా మురళీలా ఏనాడూ చిన్న వివాదం అతణ్ని అంటుకోలేదు. వార్న్‌ స్పిన్‌లోని స్వచ్ఛత, అందం అతణ్ని దేశంతో సంబంధం లేకుండా ప్రతి క్రికెట్‌ అభిమానికీ చేరువ చేసింది. వార్న్‌ రనప్‌.. అతను మణికట్టును తిప్పే తీరు.. ఎక్కడో పడి ఇంకెక్కడో తిరిగే అతడి బంతులు.. ఏం జరిగిందో అర్థం కాక బ్యాట్స్‌మెన్‌ చూసే బిత్తర చూపులు.. తమ కళ్లను తామే నమ్మలేక వికెట్‌ కీపర్లు, ఫీల్డర్లు, చివరికి అంపైర్లూ సంభ్రమాశ్చర్యంతో చూసే చూపులు.. బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాక వార్న్‌ చేసే సింహనాదాలు.. ఇవన్నీ నిన్నటితరం క్రికెట్‌ అభిమానులకు అపురూప జ్ఞాపకాలే. అందుకే మైదానం అవతల ఎన్ని వివాదాల్లో మునిగి తేలినా.. తన బౌలింగ్‌తో వార్న్‌ పంచిన వినోదం గుర్తుకొచ్చి అతణ్ని మన్నించేస్తుంటారు.

శతాబ్దాల చరిత్ర ఉన్న క్రికెట్లో కోటది మంది ఈ ఆట ఆడారు.. ఆడుతున్నారు. కానీ ఇంతమందిలో షేన్‌ వార్న్‌ ‘ఒకే ఒక్కడు’. వార్న్‌కు ముందూ స్పిన్నర్లున్నారు. తర్వాతా ఉన్నారు. కానీ వార్న్‌లా బౌలింగ్‌ చేయగలిగేది మాత్రం అతను మాత్రమే. వార్న్‌ శైలిని అనుసరించడం, అనుకరించడం ఇంకొకరికి సాధ్యం కాని పని. చాలా కష్టపడితే ఒకటో రెండో బంతులు వార్న్‌ అతి తక్కువగా స్పిన్‌ చేసే బంతులతో సరితూగుతాయేమో. కానీ నిలకడగా అతడిలా బంతిని గింగిరాలు తిప్పడం.. చూస్తున్నంతసేపూ చూడాలనిపించేలా చేయడం సాధ్యం కాదు. క్రికెట్లో ఏముంది.. బంతిని విసరడం.. బ్యాటుతో కొట్టడం అని ఎవరైనా తేలిక చేస్తే ఒక్కసారి వార్న్‌ బంతుల్ని చూపిస్తే ఈ ఆటలో ఉన్న కళాత్మకత అర్థమవుతుంది. స్పిన్‌ పుట్టింది.. పెరిగింది.. తన పతాక స్థాయిని అందుకుంది ఉపఖండంలో. కానీ పేస్‌కు నెలవైన ఆస్ట్రేలియా గడ్డ నుంచి వార్న్‌ రూపంలో క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న బౌలర్‌ రావడం, ప్రపంచ క్రికెట్లో అప్రతిహతంగా సాగిన ఆ దేశ జైత్రయాత్రలో అతను కీలక పాత్ర పోషించడం వైచిత్రి!

తన బంతుల్లాగే క్రికెట్‌ ప్రపంచంలోకి తన ఆగమనం.. ప్రయాణం.. ఎదుగుదల.. అన్నీ అనూహ్యమే! ఇప్పుడు భౌతిక ప్రపంచం నుంచి అతడి నిష్క్రమణా అంతే అనూహ్యం! కానీ క్రికెట్‌ బంతి తిరుగుతున్నంత కాలం వార్న్‌ క్రికెట్‌ అభిమానుల జ్ఞాపకాల్లో తిరుగుతూనే ఉంటానడంలో సందేహం లేదు.


షేన్‌ వార్న్‌ కన్నుమూత

మెల్‌బోర్న్‌: ఫాస్ట్‌బౌలర్ల ఆధిపత్యం సాగుతున్న సమయంలో.. పేసర్లకు స్వర్గధామం లాంటి ఆస్ట్రేలియా పిచ్‌లపై.. తన లెగ్‌స్పిన్‌తో సరికొత్త చరిత్ర లిఖించిన దిగ్గజం షేన్‌వార్న్‌ తుదిశ్వాస విడిచాడు. థాయ్‌లాండ్‌లో వార్న్‌ గుండెపోటుతో మరణించినట్లు భావిస్తున్నట్లు అతడి సిబ్బంది తెలిపారు. 52 ఏళ్ల ఆయనకు ఓ తనయుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. థాయ్‌లాండ్‌లోని రెండో అతి పెద్ద ద్వీపమైన కోహ్‌ సమూయిలోని తన విల్లాలో ఆయన మృతి చెందాడు. ‘‘షేన్‌వార్న్‌ తన విల్లాలో అచేతనంగా పడి ఉన్నారు. వైద్య బృందం ఎంతగా ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆయన మరణానికి గుండెపోటు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. వారి కుటుంబం ఇప్పుడు గోప్యతను కోరుకుంటోంది. మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని వార్న్‌ సిబ్బంది ప్రకటించారు. 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వార్న్‌.. 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌ (800) తర్వాత వార్న్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 194 వన్డేల్లో 293 వికెట్లు సాధించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్న్‌.. 2013లో అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 1999 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ విజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా విభిన్న పాత్రలు పోషించాడు.


సంతాపం ప్రకటించిన కొన్ని గంటలకే..

ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ రాడ్‌ మార్ష్‌ మరణానికి సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేసిన కొన్ని గంటలకే వార్న్‌ మృతి చెందడం విషాదకరం. వారం క్రితం గుండెపోటుకు గురైన మార్ష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ వార్న్‌ ఉదయమే ట్వీట్‌ చేశాడు. ఆటలో దిగ్గజమైన మార్ష్‌ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, ఆయన మృతి పట్ల వార్న్‌ విచారం వ్యక్తం చేశాడు. కానీ కొన్ని గంటల్లోనే వార్న్‌ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు.


వివాదాల్లోనూ..

తన లెగ్‌స్పిన్‌తో ఆటలో రారాజుగా వెలుగొందిన వార్న్‌ జీవితంలో వివాదాలకు కొదవలేదు. డ్రగ్స్‌, ఫిక్సింగ్‌, అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు.. ఇలా ఆయన జీవితంలో అనేక చీకటి కోణాలున్నాయి. 1994లో శ్రీలంకలో ప్రపంచ సిరీస్‌ టోర్నీ సందర్భంగా ఓ మ్యాచ్‌కు సంబంధించి పిచ్‌, వాతావరణ పరిస్థితుల గురించి ఓ బుకీకి సమాచారం ఇచ్చి డబ్బులు తీసుకున్నారని వార్న్‌తో పాటు మార్క్‌ వాకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) జరిమానా విధించింది. శ్రీలంక కెప్టెన్‌ రణతుంగ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 1999 ప్రపంచకప్‌కు ముందు వార్న్‌కు జరిమానాతో పాటు రెండు మ్యాచ్‌లు నిషేధాన్ని ఐసీసీ విధించింది. డ్రగ్‌ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో అతణ్ని 2003 ప్రపంచకప్‌ ఆరంభానికి ఒక్క రోజు ముందు తిరిగి ఇంటికి పంపించారు. సీఏ వార్న్‌పై ఏడాది నిషేధం విధించింది. 2000లో ఓ బ్రిటీష్‌ నర్సుకు లైంగిక వాంఛతో కూడిన సందేశాలు పంపించాడనే కారణంతో వైస్‌ కెప్టెన్సీ నుంచి వార్న్‌ను తప్పించారు. 2005 దక్షిణాఫ్రికా పర్యటనలోనూ ఇలాగే మరో మహిళకు అసభ్యకర సందేశాలు పంపాడు. మోడల్స్‌తో కలిసి లోదుస్తుల్లో వార్న్‌ దిగిన ఫొటోలు పత్రికలో వచ్చాయి.


ఐపీఎల్‌ తొలి టైటిల్‌..


వాళ్లిద్దరి పోరు.. ఆ మజాయే వేరు!

సచిన్‌ బ్యాటింగ్‌ చూడటం, వార్న్‌ స్పిన్‌ బౌలింగ్‌ను వీక్షించడం.. దేశంతో సంబంధం లేకుండా నిన్నటి తరం క్రికెట్‌ అభిమానులందరికీ ఇష్టమైన వ్యాపకాలివి. మరి ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడితే..? 90వ దశకంలో వీళ్లిద్దరి పోరాటాలు పంచిన మజా అంతా ఇంతా కాదు. ఎంతోమంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించిన వార్న్‌పై సచిన్‌దే పైచేయి కావడం విశేషం. ఆరంభంలో సచిన్‌ కూడా వార్న్‌ బౌలింగ్‌కు తికమక పడ్డవాడే. కానీ వార్న్‌ను దెబ్బ కొట్టడానికి త్వరగానే మంత్రం కనిపెట్టాడు మాస్టర్‌. లెగ్‌ స్టంప్‌కు ఆవల, పిచ్‌ అంచులో బంతిని వేసి అనూహ్యంగా దాన్ని స్పిన్‌ చేసే వార్న్‌ను ఎలా ఎదుర్కోవాలో బ్యాట్స్‌మెన్‌కు అర్థం కాక తలలు పట్టుకుంటున్న సమయంలో.. సచిన్‌ క్రీజు దాటి బయటికి వచ్చి బంతి స్పిన్‌ కావడానికి అవకాశం ఇవ్వకుండా పిచ్‌ అయ్యి అవ్వంగానే లాఫ్టెడ్‌ షాట్‌తో లాంగాన్‌, లాంగాఫ్‌లో బౌండరీ దాటించడం ద్వారా వార్న్‌ను ఎదుర్కొనే చిట్కాను క్రికెట్‌ ప్రపంచానికి నేర్పించాడు. అలాగే ప్యాడిల్‌ స్వీప్‌తో వార్న్‌ బంతుల్ని వికెట్ల వెనుక బౌండరీ బాట పట్టించడంలోనూ మాస్టర్‌ తన నైపుణ్యాన్ని చూపించాడు. వార్న్‌ బౌలింగ్‌లో ఈ తరహా షాట్లను వేరే బ్యాట్స్‌మెన్‌ కూడా అతణ్ని అనుసరించడం మొదలుపెట్టారు. కానీ సచిన్‌లా వార్న్‌పై ఎవరూ ఆధిపత్యం చలాయించలేకపోయారు. ముఖ్యంగా షార్జాలో సచిన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ల్లో వార్న్‌ కొట్టుకుపోయాడనే చెప్పాలి. సచిన్‌ తనకు పీడకలలు మిగిల్చాడని వార్న్‌ వ్యాఖ్యానించింది అప్పుడే. అయితే ఎక్కువసార్లు సచిన్‌దే ఆధిపత్యం అయినా.. కొన్నిసార్లు మాస్టర్‌ను బుట్టలో వేసుకోవడం ద్వారా వార్న్‌ పైచేయి సాధించేవాడు. మైదానంలో ఇలా హోరాహోరీగా తలపడ్డ సచిన్‌, వార్న్‌.. బయట మాత్రం మంచి మిత్రులు.


అంతర్జాతీయ క్రికెట్‌కు 2007లో వీడ్కోలు పలికిన వార్న్‌.. 2008లో ఆరంభమైన ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. తొలి సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేని రాజస్థాన్‌ రాయల్స్‌ను విజేతగా నిలిపాడు. కెప్టెన్‌గా తన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్‌ పెట్టాడు. బౌలింగ్‌లోనూ రాణించి సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. 2011 వరకూ ఆ జట్టుతోనే ఉన్నాడు. కెప్టెన్‌గానే కాక కోచ్‌గానూ ద్విపాత్రాభినయం చేశాడు.

* అంతర్జాతీయ క్రికెట్లో టెస్టులు, వన్డేల్లో కలిపివార్న్‌ 1001 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లెగ్‌స్పిన్నర్‌ అతనే.

దిగ్భ్రాంతి, బాధ కలుగుతోంది. నిన్ను మిస్సవుతాం వార్న్‌. మైదానంలో లేదా బయట కావొచ్చు.. నీతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిస్తేజంగా అనిపించలేదు. మైదానంలో మన ఇద్దరి పోరాటం, బయట పరిహాసాలను ఎంతో విలువైనవిగా పరిగణిస్తా. భారత్‌ను నువ్వెప్పుడూ ప్రత్యేకంగా చూశావు. అలాగే భారతీయులకు కూడా నీపై ప్రత్యేక అభిమానం ఉంది. చాలా త్వరగా వెళ్లిపోయావు’’  

- సచిన్‌

‘‘జీవితం ఎంతో చంచలమైంది, అనూహ్యమైంది. మా ఆటలో దిగ్గజం, బయట కూడా నాకెంతగానో తెలిసిన వ్యక్తి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. క్రికెట్‌ బంతిని తిప్పేసిన గొప్ప ఆటగాడి ఆత్మకు శాంతి కలగాలి’’

- కోహ్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని