Shane Warne: నేను ఈ జట్టులో ఉండలేను. మీ డబ్బు మీకు తిరిగిస్తా’

రాజస్థాన్‌ను తొలి సీజన్‌లోనే విజేతగా నిలిపి సంచలనం సృష్టించిన దిగ్గజ క్రికెటర్‌, దివంగత షేన్‌వార్న్‌.. ఆ టోర్నీ ఆరంభానికి ముందే ఆ జట్టు యజమాని మనోజ్‌ బదాలేకు షాకిచ్చాడు...

Published : 30 May 2022 02:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ను తొలి సీజన్‌లోనే విజేతగా నిలిపి సంచలనం సృష్టించిన దిగ్గజ క్రికెటర్‌, దివంగత షేన్‌వార్న్‌.. ఆ టోర్నీ ఆరంభానికి ముందే ఆ జట్టు యజమాని మనోజ్‌ బదాలేకు షాకిచ్చాడు. ఓ ఆటగాడిని ఎంపిక చేసే విషయంలో ఇద్దరి మధ్యా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో యజమానినే బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ టోర్నీ నుంచి తప్పుకొంటానని వార్న్‌ హెచ్చరించడంతో మనోజ్‌ చేసేదిలేక మిన్నకుండిపోయాడు. ఈ విషయాన్ని షేన్‌వార్న్‌ తన ఆటోబయోగ్రఫి ‘నో స్పిన్‌’లో ఇలా రాసుకొచ్చాడు.

‘అప్పుడు జట్టు ఎంపికలో మనోజ్‌ ఒక ఆటగాడిని ఎంపిక చేయాలని నన్ను కోరారు. కానీ, అతడిని ఎంపిక చేస్తే జట్టులో నాకు విలువ ఉండదని అనిపించింది. ఆ ఆటగాడు సరిగ్గా ఆడకపోయినా జట్టులో ఉన్నాడంటే.. ఎవరో కావాలనే అతడికి మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మిగతా ఆటగాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకునే వీలుంది. అప్పుడు నేను వారి నమ్మకాన్ని కోల్పోతాను. ఒకవేళ ఆ ఆటగాడిని కచ్చితంగా జట్టులో ఉంచాలనుకుంటే మీరే పెట్టుకోండి నేను వెళ్లిపోతాను. నేను ఈ జట్టులో ఉండలేను. మీ డబ్బు మీకు తిరిగిస్తా’ అని చెప్పడంతో ‘ఆయన నిజంగా నువ్వు వెళ్లిపోతావా?’ అని అడగడంతో ఔనని బదులిచ్చా. దీంతో తర్వాతి రోజు మనోజ్‌ రాజీపడి ఆ ఆటగాడిని ఎంపికచేయకపోయినా ఫర్వాలేదని చెప్పాడు’ అని వార్న్‌ తన పుస్తకంలో వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని