విరాట్ కోహ్లీ.. బాబర్‌ అజామ్‌.. టెస్టుల్లో ఎవరు నం.1..? వాట్సన్‌ ఏమన్నాడంటే..?

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అత్యుత్తమ బ్యాటర్‌గా అతడిని పలువురు మాజీలు

Updated : 21 Aug 2022 12:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అత్యుత్తమ బ్యాటర్‌గా అతడిని పలువురు మాజీలు పేర్కొంటున్నారు. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే.. వన్డేలు, టీ20ల్లో నం.1 ర్యాంకులో బాబర్‌ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో మూడో స్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో టాప్‌ 3లో నిలిచిన ఏకైక బ్యాట్స్‌మన్‌ అతడే. ఈ నేపథ్యంలో పలువురు అతడిని విరాట్‌ కోహ్లీతోనూ పోల్చుతుంటారు. అయితే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ ఓ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌గా బాబర్‌ అజామ్‌ కంటే కోహ్లీనే ఎంచుకోవడం విశేషం.

ప్రస్తుత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ల్లో కోహ్లీ టాప్‌ 10లో కూడా లేకపోయినప్పటికీ విరాట్‌ ఆటతీరులో ఉన్న గొప్పతనాన్ని వాట్సన్‌ వివరించాడు. ‘టెస్టు క్రికెట్‌ అంటే.. నేను ఎప్పుడూ విరాట్‌ కోహ్లీ పేరే చెబుతాను. అ స్థాయిని మెయింటెన్‌ చేసే సత్తా అతడికి ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ అదే సత్తాను కొనసాగిస్తూ వచ్చాడు. భారత్‌ తరఫున ఆడే ప్రతి సారి అతడిలో ఆ తీవ్రత కనిపిస్తుంది. అందుకే టెస్టు క్రికెట్‌లో విరాటే ఉత్తమం’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.

‘పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ విషయానికి వస్తే అతడు అద్భుతమైన క్రికెట్‌ ఆడుతున్నాడు. అయితే.. తన ఆటను టెస్టు క్రికెట్‌కు కూడా ఎలా మలచుకుంటాడో చూడాలి. అందుకే ప్రస్తుతం అతడికి ఈ ఫార్మాట్‌లో నం.2 స్థానాన్ని ఇస్తున్నాను. ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ విషయానికి వస్తే.. అతడు ఈ జాబితాలో కాస్త వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. బౌలర్లపై అతడు అనుకున్నంత ఒత్తిడి పెంచడంలేదనిపిస్తోంది. ఇక కివీస్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌కు ఎల్బో సమస్యలు ఉన్నప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలర్లపై ఒత్తిడి పెంచగల సత్తా అతడికి ఉంది’ అని వాట్సన్‌ వివరించాడు.

ఇక విరాట్‌ కోహ్లీ ఇప్పటి వరకూ 102 టెస్టులు ఆడి 8,074 పరుగులు చేయగా.. బాబర్‌ 42 టెస్టులు ఆడి 3,122 రన్స్‌ చేశాడు. ప్రస్తుతం విరాట్‌ ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని