MS Dhoni: ఐపీఎల్‌.. ధోనీకి మరో 3-4 ఏళ్లు ఆడే సత్తా ఉంది: షేన్‌ వాట్సన్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌-16 (IPL 16) సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌కు అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చర్చ జరుగుతోంది.

Published : 21 Mar 2023 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌ (IPL)లో మాత్రం అభిమానులను అలరిస్తున్నాడు. నాలుగుసార్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)ని ఛాంపియన్‌గా నిలబెట్టి ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌-16 సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. జట్టు శిబిరంలో చేరి సాధన చేస్తున్నాడు. అయితే, ధోనీ ఈ ఏడాది ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని సీఎస్కే ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (Deepak Chahar)ని అడగ్గా ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.

‘‘ఐపీఎల్‌లో ధోనీకి ఇదే చివరి ఏడాది అని ఎవరు చెప్పారు. నిజానికి ధోనీ కూడా స్వయంగా ఈ మాట ఎప్పుడూ అనలేదు. అతను  ఇంకొన్నాళ్లు ఆడతాడని భావిస్తున్నా. ఆడాలని కోరుకుంటున్నా కూడా. రిటైర్మెంట్ గురించి మాకు తెలియదు. ఎప్పుడు రిటైర్‌ కావాలో ధోనీకి బాగా తెలుసు. టెస్టు క్రికెట్‌కు, తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయంలో ధోని తీసుకున్న నిర్ణయాలు మనమంతా చూశాం కదా! నేనైతే అతను ఇంకొన్నాళ్లు ఆడతాడనే అనుకుంటున్నా. ధోనీ కెప్టెన్సీలో అతనితో కలిసి క్రికెట్‌ ఆడాలనే నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నా. అతను ఇప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌ చేసినప్పుడు ఆ విషయం మీకు అర్థమవుతుంది’ అని దీపక్‌ చాహర్‌ అన్నాడు. 

ఆస్ట్రేలియా, సీఎస్కే మాజీ ఆటగాడు షేన్ వాట్సన్‌  (Shane Watson) కూడా ఐపీఎల్‌లో ధోనీ కెరీర్‌ గురించి స్పందించాడు. ‘ధోనీకి ఇదే ఆఖరి సీజన్‌ అని విన్నాను. కానీ, అలా జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు.  మరో 3-4 ఏళ్లు ఆడే సత్తా అతడికి ఉంది.  ధోనీ ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ చాలా బాగా చేస్తున్నాడు. అతనొక గొప్ప నాయకుడు. సీఎస్‌కే విజయవంతం కావడానికి ప్రధాన కారణం అతడి కెప్టెన్సీనే. నాకు తెలిసి ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్‌ కాదు.. ఇంకొంత కాలం కొనసాగుతాడు’’ అని షేన్‌ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని