WTC Final: పిచ్‌ పరిస్థితి అలా ఉంది.. 450 కూడా కొట్టొచ్చు: శార్దూల్‌

తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) కెన్నింగ్టన్ ఓవల్‌ పిచ్‌పై చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. అలాగే టార్గెట్‌ ఎంత ఉంటే ఛేదించవచ్చో కూడా చెప్పేశాడు.

Updated : 10 Jun 2023 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌ నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ జరుగుతున్న కెన్నింగ్టన్‌ ఓవల్‌ పిచ్‌పై టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌ను సరిగ్గా సిద్ధం చేయలేదన్న శార్దూల్‌... 2021లో ఇక్కడ తాము ఆడిన పిచ్‌ కంటే భిన్నంగా ఉందన్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 157 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచిన విషయం తెలిసిందే. అందులో శార్దూల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ శతకాలతో మెరిశాడు.

WTC Final పిచ్‌ గురించి స్పందిస్తూ.. ‘‘ఆట కొనసాగుతున్నప్పుడు గతంలో రోలర్లను ఉపయోగించడంతో పిచ్‌ ఫ్లాట్‌గా మారింది. కానీ ఈసారి అలా జరగడం లేదు. పిచ్‌ అంతగా సిద్ధంగా లేనట్లు అనిపిస్తోంది. గత రెండు రోజులను చూస్తే కాస్త ఎగుడు దిగుడుగా అనిపిస్తోంది’’ అని చెప్పాడు. అయితే ఈ టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయిగా కనిపిస్తున్నప్పటికీ.. టీమ్‌ఇండియా ఇంకా గేమ్‌లోనే ఉందని అన్నాడు. ‘ఐసీసీ ఫైనల్‌ లాంటి మ్యాచ్‌ల్లో.. ఇదే సరైన టోటల్‌ స్కోర్‌ అని ఎవరూ చెప్పలేరు. మంచి భాగస్వామ్యం ఉంటే చాలు 450 పరుగులనైనా ఛేదించొచ్చు. ఇక్కడ గత ఏడాది ఇంగ్లాండ్‌ ఎక్కువ వికెట్లు కోల్పోకుండానే 400 పరుగులను ఛేదించింది’’ అని శార్దూల్‌  గుర్తు చేశాడు. 

అనుకున్నట్లుగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు 444 పరుగుల లక్ష్యం ఇచ్చింది ఆసీస్‌. దీంతో శార్దూల్‌ చెప్పిన మాట నిజమవుతుందా? లేదా అనేది చూడాలి. ఓవర్‌ నైట్‌ స్కోరు 123/4తో నాలుగో రోజు బరిలోకి దిగిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 270/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత్‌ విజయ లక్ష్యం 444గా ఖరారైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 469కు ఆలౌట్‌ కాగా.. భారత్ 296 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్లలో అలెక్స్‌ కేరీ (66), మిచెల్ స్టార్క్ (41), లబుషేన్ (41), స్టీవ్ స్మిత్ (34) రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3, ఉమేశ్‌ యాదవ్‌ 2, షమి 2, సిరాజ్‌ ఒక వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని