Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్‌

వచ్చిన తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తానెంటో నిరూపించుకున్న సంజూ శాంసన్‌ (Sanju Samson)ని జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రశ్నించారు.

Updated : 24 Mar 2023 11:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌లో మైదానంలో నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించే సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav).. వన్డే క్రికెట్‌కి వచ్చేసరికి పూర్తిగా తేలిపోతున్నాడు. వరుస మ్యాచ్‌లో విఫలమవుతూ విమర్శల పాలవుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్‌ డక్ కావడంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) కూడా సూర్యకుమార్‌ పేలవమైన ఆటతీరు పై స్పందించారు. సూర్యకుమార్‌ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే వచ్చిన తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌ (Sanju Samson)కు మద్దతుగా నిలిచారు.

వరుసగా విఫలమవుతున్నప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశాలిస్తున్నారని, మరి వచ్చిన తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తానేంటో నిరూపించుకున్న సంజూ శాంసన్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదని శశిథరూర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.  ‘పాపం.. సూర్యకుమార్‌ యాదవ్‌ వరుసగా మూడుసార్లు గోల్డెన్‌ డక్‌ అయి ప్రపంచంలోనే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అయితే,   ఇంతకుముందు తానెప్పుడూ ఆడని ఆరో స్థానంలో  బ్యాటింగ్‌కు వచ్చినా 66 సగటుతో ఉన్న సంజూ శాంసన్‌ని ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు? అతను ఇంకేం చేయాలి?’అని శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ను సంజూ శాంసన్‌తో పోల్చవద్దని భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అభిమానులను కోరారు.‘ఎవరు బాగా ఆడితే వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ని సంజూ శాంసన్‌తో పోల్చకండి. అది సరైనది కాదు. సంజూ బ్యాడ్‌ఫేజ్‌లో ఉంటే మీరు మరొకరి గురించి మాట్లాడతారు. ఇది జరగకూడదు. ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ సూర్యకుమార్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే  అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎవరి అభిప్రాయం వారు చెబుతారు. చివరికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని కపిల్‌ దేవ్ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని