Shikhar Dhawan : నేను పెళ్లి విషయంలో ఫెయిలయ్యాను.. : శిఖర్‌ ధావన్‌

తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయిన విషయంపై క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan) స్పందించాడు.

Published : 26 Mar 2023 22:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  టీమ్‌ఇండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan) తొలిసారిగా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు. పెళ్లి విషయంలో తాను విఫలమైనట్లు వెల్లడించాడు. శిఖర్‌ ధావన్‌, అతడి భార్య అయేషా ముఖర్జీ(Aesha Mukherjee) వీడిపోయినప్పటి నుంచి వీరిద్దరిలో ఎవరూ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడలేదు. అయితే.. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ధావన్‌ ఈ విషయంపై  మొదటిసారిగా స్పందించాడు.

‘పెళ్లి విషయంలో నేను విఫలమయ్యాను. ఈ విషయంలో నేను ఎవరినీ వెలెత్తి చూపడం లేదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఈ విషయంలో నాకు పెద్దగా అవగాహన లేకపోవడంతో విఫలమయ్యాను. ఇప్పుడు క్రికెట్‌ గురించి నేను చెప్పే విషయాలు.. 20 ఎళ్ల క్రితం నాకు తెలిసి ఉండేవి కావు కదా. ఏదైనా అనుభవంతోనే వస్తుంది’ అని ధావన్‌ వివరించాడు.

ఇక తన విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉందన్న ధావన్‌.. భవిష్యత్‌లో పెళ్లి చేసుకునే విషయంపై కూడా స్పందించాడు. అయితే.. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదన్నాడు. ‘ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తోంది. భవిష్యత్‌లో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే.. మరింత తెలివిగా ఆలోచించి ముందుకెళ్తాను. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో.. నా జీవితాన్ని నేను ఎవరితో గడపగలనో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నేను ప్రేమలో పడినప్పుడు.. ఆ సమయంలో ఉన్న ప్రతికూలతలు తెలుసుకోలేకపోయా. కానీ.. ఇప్పుడు ప్రేమలో పడితే.. ప్రతికూలతలను తెలుసుకుంటాను. అవి ఉంటే ఆ బంధం నుంచి బయటకు వస్తాను. లేకపోతే కొనసాగిస్తాను’ అని వివరించాడు.

ఇక ధావన్‌ ఈ అంశంలో యువతకు కూడా సందేశమిచ్చాడు. ఎవరితోనేనా రిలేషన్‌లో ఉన్న సమయంలో.. ఆ బంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించాడు. ఆ తర్వాతే ఆ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరాడు. హడావుడిగా భావోద్వేగపు నిర్ణయాలు తీసుకొని పెళ్లి చేసుకోకూడదన్నాడు. ‘మీరు ఇష్టపడేవారితో కొన్ని రోజులు కలిసి తిరగండి. మీ అభిరుచులు కలిసాయో లేదో తెలుసుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి’ అని యువతను కోరాడు.

టీమ్‌ఇండియా(Team India)లో ధావన్‌ కీలక ఆటగాడే అయినప్పటికీ.. అతనికి ప్రస్తుతం జట్టులో చోటు దక్కడం లేదన్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు