SKY: కెరీర్‌లో ఇలాంటివి సహజం.. వాటిని అధిగమించడమే సవాల్‌: ధావన్‌, యువీ

ఆసీస్‌తో (IND vs AUS)  మూడు వన్డేల్లోనూ సూర్యకుమార్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. తొలి బంతికే ఔట్‌ కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో అభిమానుల నుంచి విమర్శలు వచ్చినా.. మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు మాత్రం బాసటగా నిలిచారు.

Published : 28 Mar 2023 12:29 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్‌లో అదరగొట్టిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav).. టెస్టులు, వన్డేల్లో మాత్రం తేలిపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. వరుసగా వన్డేల్లో వచ్చిన అవకాశలను సద్వినియోగం చేసుకోవడంలో సూర్య విఫమలయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సున్నాకే పెవిలియన్‌కు చేరిన విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్‌లోనూ తొలి బంతికే వెనుదిరిగడంపై  మాజీలు ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచ కప్‌ నేపథ్యంలో మరొకరికి అవకాశం ఇచ్చి.. సూర్యకుమార్‌ను కేవలం పొట్టి ఫార్మాట్‌కే పరిమితం చేయాలనే సూచనలూ వచ్చాయి.  కానీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌ మాత్రం సూర్యకుమార్‌కు అండగా నిలిచారు. తాజాగా  టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్, మాజీ ఆల్‌రౌండర్ యువ్‌రాజ్‌ సింగ్‌ సూర్యకు బాసటగా మాట్లాడారు. 

‘‘ గత రెండేళ్లుగా సూర్యకుమార్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతూ వచ్చాడు. అయితే, ఇటీవల సిరీసుల్లో మాత్రం సరిగా రాణించలేదు. క్రికెట్‌ కెరీర్‌లో ఫామ్‌ కోల్పోవడం సహజం.  టెస్టు ఫార్మాట్‌ గురించి చెప్పాలంటే.. పిచ్‌ చాలా విభిన్నంగా ఉంటుంది. భారత్‌లో ఆడేటప్పుడు టర్నింగ్‌ ట్రాక్‌లను సిద్ధం చేసుకుంటాం. టీమ్‌ఇండియా గెలవాలంటే ఇలా చేయక తప్పదు. ఇలాంటి పిచ్‌ మీద రాణించడం బ్యాటర్లకు సవాల్‌.  ఎంత టాప్‌ బ్యాటర్‌ అయినప్పటికీ ఆడటం కష్టమవుతుంది. అప్పుడు అనుభవం ఉపయోగపడుతుంది. నేర్చుకునే క్రమంలో యువకులు తప్పులు చేస్తుంటారు’’ అని ధావన్ తెలిపాడు. 

సూర్యకుమార్‌ త్వరలోనే ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకుంటాడని మాజీ ఆటగాడు యువ్‌రాజ్‌ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నాడు. ‘‘ప్రతి క్రికెటర్‌ కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటాడు. సూర్యకుమార్‌ తప్పకుండా పుంజుకుంటాడు. అవకాశాలు ఇస్తూ ఉంటే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున సూర్య కీలక పాత్ర పోషిస్తాడు. మన ఆటగాళ్లు అదరగొడతారు. సూర్యకుమార్‌ ఆత్మవిశ్వాసం తిరిగి సాధిస్తాడు’’ అని యువీ ట్వీట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని