T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!

వన్డేల్లో సుస్థిర స్థానం దక్కించుకుంటూ.. రోహిత్ లేనప్పుడు టీమ్‌ఇండియా జట్టుకు సారథిగా వ్యవహరించే శిఖర్ ధావన్‌ టీ20ల్లో మాత్రం...

Published : 10 Aug 2022 02:18 IST

టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ శిఖర్ ధావన్‌

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డేల్లో సుస్థిర స్థానం దక్కించుకుంటూ.. టీమ్‌ఇండియా-B జట్టుకు సారథిగా వ్యవహరించే శిఖర్ ధావన్‌ టీ20ల్లో మాత్రం టీమ్‌లో ఉండలేకపోతున్నాడు. సెలెక్షన్‌ కమిటీ కూడా ధావన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయితే ఎందుకు ఎంపిక చేయడంలేదో తనకీ తెలియదంటున్నాడు ఈ ఓపెనర్‌. కేవలం తన పరిధిలోని విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని,  మిగతావాటిని పట్టించుకోనని ధావన్‌ వెల్లడించాడు. కేవలం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టిసారిస్తానని తెలిపాడు. 

‘‘టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు. అయితే ఏదొక కారణమైతే ఉండే ఉంటుంది. దీనిపై లోతుగా ఆలోచించను. ఎందుకు చాలా కాలంగా భారత్‌ జట్టుకు టీ20ల్లో దూరంగా ఉన్నానో అర్థం కావడం లేదు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టిపెడతా. అది భారత టీ20 లీగ్‌.. వన్డేలు.. ఇతర ఏ మ్యాచ్‌ అయినా సరే రాణించడంపైనే ఆలోచిస్తా. అదే మన నియంత్రణలో ఉండే అంశం’’ అని ధావన్‌ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, మాజీ కోచ్‌ రవిశాస్త్రి శైలి గురించి స్పందిస్తూ.. ‘‘ఇద్దరి ఎనర్జీ పూర్తి విరుద్ధం. ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిత్వం ఉంటుంది. రవిశాస్త్రి ఉంటే అక్కడి వాతావరణం వేరుగా ఉంటుంది. అయితే ఇద్దరితోనూ అనుబంధం ఉంది. రాహుల్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. 

వన్డే క్రికెట్‌ ఆడటం తనకెంతో ఇష్టమని, ఇప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్‌ ప్రభ కొనసాగుతుందని తెలిపాడు. టెస్టులు, టీ20లు.. వేటికవే ప్రత్యేక గుర్తింపు ఉందని, అలాగే వన్డే క్రికెట్‌కు ఉందని వివరించాడు. విరాట్ కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్‌ చాలని, అతడొక ఛాంపియన్‌.. తప్పకుండా ఫామ్‌లోకి వస్తాడని ధావన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ధావన్‌ ఇటీవల శ్రీలంక, వెస్టిండీస్‌లతో జరిగిన వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే ఆగస్టు 18 నుంచి జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు సారథిగా ధావన్‌ ఎంపికయ్యాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని