
Team India: గబ్బర్ సేన వచ్చేసింది..!
ముంబయి: వచ్చేనెల శ్రీలంక పర్యటన కోసం బీసీసీఐ గతవారం శిఖర్ ధావన్ నేతృత్వంలో 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాళ్లంతా అక్కడికి వెళ్లేముందు రెండు వారాలు ముంబయిలో ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం వాళ్లంతా అక్కడికి చేరుకున్నారని బీసీసీఐ ఫొటోలతో సహా ట్వీట్ చేసింది. లంక పర్యటనకు ఎంపిక చేసిన 20 మంది వచ్చారని, దాంతో అందరూ ఏకమయ్యారని సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ఇప్పుడా ఆటగాళ్లంతా 14 రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. అక్కడ వారికి రోజు విడిచి రోజు ఆరుసార్లు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
మరోవైపు కోహ్లీ సారథ్యంలోని ప్రధాన భారత జట్టు ప్రస్తుతం సౌథాంప్టన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజుల్లో న్యూజిలాండ్‌తో తలపడే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సమాయత్తమవుతోంది. ఆ మ్యాచ్ తర్వాత అదే జట్టు ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే జులై నెల ఖాళీగా ఉండటంతో బీసీసీఐ లంక పర్యటనను ఖరారు చేసింది. దానికి ధావన్ నేతృత్వంలో యువ బృందాన్ని ఎంపిక చేసింది. జులై 13 నుంచి 18 వరకు మూడు వన్డేలు, ఆపై 21 నుంచి 25 వరకు మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అలాగే ఈ జట్టుకు టీమ్‌ఇండియా మాజీ సారథి, ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా బీసీసీఐ నిర్ణయించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.