Shivam Dube: రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడినట్లుంది.. నాపై ఒత్తిడేం లేదు: శివమ్‌ దూబె

భారత యువ బ్యాటర్ శివమ్‌ దూబె ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. యూఎస్‌ఏపై కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

Published : 13 Jun 2024 13:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శివమ్‌ దూబె (Shivam Dube).. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లతోపాటు దూకుడుగా ఆడే రిషభ్ పంత్ వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును ఆదుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌కు (50*) మద్దతుగా నిలిచిన దూబె (31*) విలువైన పరుగులను సాధించాడు. టీ20 వరల్డ్‌ కప్‌లో మొదటి రెండు మ్యాచుల్లో అతడు విఫలమైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా సరైన ప్రదర్శన చేయకపోతే తుది జట్టులో అవకాశం చేజారేదే. యూఎస్‌ఏపై మాత్రం అద్భుతంగా ఆడాడు. తన ఆటతీరుపై దూబె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘టోర్నీ ఆరంభంలో నా ఫామ్‌పై ఇబ్బంది పడ్డా. ఎలా బయటపడాలనే దానిపై దృష్టిసారించా. అందుకోసం తీవ్రంగా శ్రమించా. అదే సమయంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. కోచ్‌లు, సహాయక సిబ్బంది మద్దతుగా నిలిచారు. ‘ఇలాంటి పిచ్‌పై ఆడటం చాలా కష్టం. అయినా సిక్స్‌లు కొట్టగలిగే సత్తా నీకుంది. దానిని అనుసరించా’ అని ఉద్భోద చేశారు. నా ఆటతీరుపై నాకెలాంటి అనుమానాలు లేవు. సీఎస్కే తరఫున ఐపీఎల్‌లో దూకుడుగా ఆడినప్పటికీ.. ఇప్పటి పిచ్‌ పరిస్థితుల్లో చాలా మార్పులు ఉన్నాయి. అందుకోసం ఇలాంటి పిచ్‌లపై విభిన్నమైన విధానం అనుసరించా. యూఎస్‌ఏపై విభిన్నంగా ఆడేందుకు ప్రయత్నించా. 

ఇప్పుడు ఈ టోర్నీలో నేను ఆడుతుంటే.. నాకు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ గుర్తుకొచ్చింది. ఇది తెల్లబంతి పోరుగా అనిపించలేదు. మరీ ముఖ్యంగా సిక్స్‌ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. మనం ఎలా ఆడాలనేది పిచ్‌ కండీషన్ నిర్దేశిస్తోంది. అత్యుత్తమ షాట్‌ను ఎంపిక చేసుకుంటేనే సిక్స్‌ కొట్టగలుగుతాం. ఏమాత్రం మిస్‌ అయినా వికెట్‌ నష్టపోవడమే. అందుకోసమే నేను చాలాసేపు వేచి చూశా. తొలి బంతి నుంచే హిట్టింగ్‌ చేయాలనుకోవడం సరికాదు. ఇక్కడ అస్సలు అలాంటి పరిస్థితే ఉండదు. కాస్త సమయం తీసుకోవాల్సిందే. చెత్త బంతి పడే వరకు వేచి చూడాలి. ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. నేను విఫలమైనప్పుడూ వాటి నుంచి పాఠాలు నేర్చుకొనేందుకు ప్రయత్నించా. అందుకే, ఇక్కడ ఏ జ్ఞాపకాన్ని చెరిపేయాలనుకోను. ఇక బౌలింగ్‌ కూడా వేసేందుకు సిద్ధమవుతున్నా. ఈసారి ఒక ఓవర్‌ మాత్రమే వేసే అవకాశం వచ్చింది. ప్రత్యర్థి బ్యాటర్ సిక్స్‌ కొట్టడంతో మరో ఓవర్‌ రాలేదు. భవిష్యత్తులో మరిన్ని ఓవర్లు వేసేందుకు ప్రయత్నిస్తా’’ అని దూబె వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని