Shivam Mavi: అరంగేట్ర మ్యాచ్‌లోనే శివమ్‌ మావి రికార్డు.. ఆ ఘనత సాధించిన మూడో బౌలర్‌

శ్రీలంకతో జరిగిన తొలి టీ20తో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన శివమ్‌ మావి.. తన మొదటి మ్యాచ్‌లోనే అరుదైన రికార్డును నమోదు చేశాడు.

Updated : 04 Jan 2023 11:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు టీమ్‌ఇండియా బౌలర్‌ శివమ్‌ మావి. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతంగా బౌలింగ్‌ చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఓ స్పెషల్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ 24 ఏళ్ల యువ బౌలర్‌. అరంగేట్ర మ్యాచ్‌లో టీ20ల్లో భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచిన మూడో ఆటగాడిగా మావి రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు బరిందర్‌ శరణ్‌, స్పిన్నర్‌ ప్రజ్ఞాన్ ఓజా ఈ ఘనత సాధించారు. 

2016లో బరిందర్‌.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసి 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 2009లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఓజా అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో ఓజా 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక, లంకతో తొలి టీ20 మ్యాచ్‌ విషయానికొస్తే.. చివరి బంతి వరకు సాగిన ఈ పోరులో భారత్‌ 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. చివరి ఓవర్‌లో అక్షర్‌ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 పుణె వేదికగా గురువారం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని