Dhoni: ధోనీ ఈ సమయంలో ఎందుకు తప్పుకొన్నాడో అర్థం కాలేదు: షోయబ్‌ అక్తర్‌

మెగా టోర్నీ ప్రారంభానికి ముందు మహేంద్రసింగ్‌ ధోనీ చెన్నై కెప్టెన్‌గా తప్పుకోవడం తనకు అర్థంకాలేదని పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్ అక్తర్‌ ఆశ్చర్య...

Published : 28 Mar 2022 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెగా టోర్నీ ప్రారంభానికి ముందు మహేంద్రసింగ్‌ ధోనీ చెన్నై కెప్టెన్‌గా తప్పుకోవడం తనకు అర్థంకాలేదని పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్ అక్తర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడు కెప్టెన్సీ వదులుకున్న సమయం సరికాదని అభిప్రాయపడ్డాడు. 2008 టోర్నీ ప్రారంభం నుంచీ చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ ఆ జట్టుకు నాలుగు సార్లు టైటిల్‌ అందించడమే కాకుండా అత్యుత్తమ సారథిగా నిలిచాడు. అయితే, గత గురువారం ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించాడు. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్‌తో అక్తర్‌ మాట్లాడాడు.

‘నిజం చెప్పాలంటే.. సరిగ్గా టోర్నీ ఆరంభానికి రెండు రోజుల ముందే అతడు కెప్టెన్సీ వదులుకోవడం నాకు అర్థం కాలేదు. జడేజా కచ్చితంగా మంచి క్రికెటరే. తన శక్తి సామర్థ్యాల మేరకు జట్టును ముందుండి నడిపిస్తాడు. అయితే, ప్రపంచ క్రికెట్‌లో ధోనీ అత్యుత్తమ సారథి. ఎవరైనా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఐపీఎల్‌లో ఇప్పటికీ అతడు అత్యుత్తమ క్రికెటర్‌. కానీ, ఇప్పుడు మానసికంగా అలసిపోయి ఉంటాడు. అందుకే చెన్నై కెప్టెన్సీ పగ్గాలు వేరొకరికి అప్పగించి.. ఆటగాడిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలని కోరుకొని ఉంటాడు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని