Babar-Akhtar: అప్పుడు బాబర్‌ను వదలకూడదనుకున్నా: అక్తర్

పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్‌ అజామ్‌ (Babar Azam)తో గతంలో జరిగిన ఓ సంఘటనను షోయబ్‌ అక్తర్‌ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో అతడిని కొట్టేంత కోపం వచ్చిందని చెప్పాడు.

Updated : 07 Mar 2023 13:30 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్‌ అజామ్‌ (Babar Azam) ఇంగ్లిష్‌లో మాట్లాడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటాడు. అతడి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ దారుణంగా ఉంటాయనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. మీడియా సమావేశాల్లోనూ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడని సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ, బాబర్‌ అజామ్‌ గురించి బాగా తెలిసిన పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్ (Shoaib Akhtar) మాత్రం అలాంటి విమర్శలను పట్టించుకోనని చెబుతున్నాడు. అలాగే, బాబర్‌కు కోచింగ్‌ ఇచ్చిన సమయంలోనూ జరిగిన ఓ సంఘటనను గుర్తు చేశాడు. నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా బౌలింగ్‌ వేసినప్పుడు స్ట్రెయిట్‌ డ్రైవ్‌ కొట్టద్దని చెప్పినా.. అలాగే చేశాడని, కోపం వచ్చిందని పేర్కొన్నాడు.

‘‘అకాడమీలో క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోసం బాబర్‌ అజామ్‌ వచ్చేవాడు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. నెట్ ప్రాక్టీస్‌ చేయించేందుకు ముదస్సర్ భాయ్‌ నాకు బాబర్‌ను అప్పగించాడు. నా బౌలింగ్‌లో స్ట్రెయిట్‌ డ్రైవ్‌ కొట్టొద్దని బాబర్‌తో చెప్పా. కానీ, అతడు నేచురల్‌ ప్లేయర్. అలాగే కొట్టేశాడు. ఒక బంతి అయితే నాకు తాకింది. వెంటనే, నేను నిన్ను వదలిపెట్టే ప్రసక్తే లేదని మనసులోనే అనుకున్నా. అప్పుడే ముదస్సర్ వెంటనే బాబర్‌ను బయటకు వచ్చేయమని చెప్పాడు. లేకపోతే  నేను బాల్‌తో కొట్టేస్తానని అతడిని హెచ్చరించాడు’’ అని అక్తర్‌ చెప్పాడు. 

పాక్‌ యువ వికెట్‌ కీపర్‌ అజామ్ ఖాన్‌పై ప్రశంసలు కురిపిస్తూ బాబర్‌ అజామ్‌పై షోయబ్‌ అక్తర్ పరోక్షంగా విమర్శలను గుప్పించాడు. ‘‘ఇన్నింగ్స్‌ను నిర్మిచడంలో ఎంతో బాధ్యత కలిగిన ఆటగాడు అజామ్ ఖాన్. ఇంటర్య్వూల్లోనూ చాలా స్మార్ట్‌గా మాట్లాడుతున్నాడు. అతడి ప్రదర్శనపై చాలా చక్కగా చెప్పగలుడుతున్నాడు. నేను 20 ఏళ్ల కిందట ఆడేటప్పుడు.. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. ఇప్పుడు మీడియాతో మాట్లాడటం కూడా ఓ విధి.  అందుకే , బాబర్‌ ఇలాంటి సమస్య నుంచి బయటపడాలి. ఇది అతడికే ప్రయోజనం చేకూర్చుతుంది’’ అని అక్తర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని