Shoaib Akhtar: ధోనీ కావాలంటే అలా చేయొచ్చు.. అక్తర్‌ ఏం చెప్పాడంటే?

ఈ సీజన్‌లో చెన్నై కథ ముగీయడంతో వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన చెన్నై కెప్టెన్‌ ప్రస్తుత టోర్నీలో కుర్రకారుతో...

Published : 14 May 2022 02:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సీజన్‌లో చెన్నై కథ ముగీయడంతో వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన చెన్నై కెప్టెన్‌ ప్రస్తుత టోర్నీలో కుర్రకారుతో సమానంగా బ్యాటింగ్‌ చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 39.80 సగటుతో 132 స్ట్రైక్‌రేట్‌తో 199 పరుగులు చేశాడు. అయితే, గతరాత్రి చెన్నై.. ముంబయి చేతిలో ఓటమిపాలవ్వడంతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి పూర్తిగా తప్పుకొంది. ఈ నేపథ్యంలోనే అతడి భవితవ్యంపై పలువురు దిగ్గజాలు స్పందిస్తున్నారు. పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మాట్లాడుతూ ధోనీ కావాలంటే వచ్చే ఏడాది కూడా ఆడొచ్చని చెప్పాడు. ఒకవేళ ఆడాలని లేకపోతే మాత్రం చెన్నై జట్టుకు మెంటార్‌గా లేదా హెడ్‌కోచ్‌గా పనిచేయాలని సూచించాడు.

‘ధోనీ విలువైన ఆటగాడు. ఏ నిర్ణయం అయినా అతడిమీదే ఆధారపడింది. అతడు జట్టుతో కలిసి ఆడినా.. లేక జట్టుతో కలిసి ప్రయాణించినా అది చెన్నైకే ఉపయోగం. అయితే, ఈసారి ఆ జట్టు యాజమాన్యం సీరియస్‌గా ఉన్నట్లు కనిపించలేదు. అసలు ఈసారి జడేజాకు కెప్టెన్సీ ఎందుకిచ్చారో మనకు తెలియదు. అది అర్థంకావట్లేదు. కానీ, వచ్చే సీజన్‌లో ఆ జట్టు స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగాలి’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. మరోవైపు ధోనీ ఎప్పుడు ఏం చేస్తాడనే విషయాలు ఎవరూ ఊహించలేరని, అతడు ఉన్నపళంగా రిటైర్మెంట్‌ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. అప్పటికప్పుడు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాడని అక్తర్‌ పేర్కొన్నాడు. అలాగే మరో సందర్భంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ స్పందిస్తూ.. ధోనీ ఇప్పటికీ వికెట్ల మధ్య అద్భుతంగా పరుగెడుతున్నట్లు చెప్పాడు. సాధారణ క్రీడాకారుల కన్నా ఈ వయసులోనూ అద్భుతంగా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు. అతడికి ఇంకా ఆడాలని ఉంటే ఇలాగే కొనసాగాలని సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని