Virat Kohli: విరాట్‌ను పొగిడేందుకు ఇదే కారణం.. షోయబ్‌ అక్తర్ ఆసక్తికర సమాధానం

భారత క్రికెట్‌ అంటేనే పాకిస్థాన్‌ మాజీలు నోరుపారేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ, ఆ దేశ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్ (Shoaib Akhtar) మాత్రం భారత క్రికెటర్లతో స్నేహంగా ఉంటాడు. అప్పడప్పుడు విమర్శలు చేసినా.. వ్యక్తిగత ప్రదర్శనలను మెచ్చుకుంటాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై (Virat Kohli) తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.

Published : 05 Mar 2023 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడేళ్ల తర్వాత టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించి మరీ  ఫామ్‌లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఆసీస్‌తో టెస్టు (IND vs AUS) సిరీస్‌ మినహా.. గతేడాది ఆసియా కప్‌ నుంచి మొన్న కివీస్‌ వన్డే సిరీస్‌ వరకు అదరగొట్టేశాడు. 34 ఏళ్ల వయసులో ఫామ్ తిరిగి అందుకోవడం అసాధారణమైన విషయమని క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు. అలాంటిది ఎన్ని విమర్శలు వచ్చినా.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా బ్యాటింగ్‌పైనే దృష్టిసారించి మరీ మునుపటి ఫామ్‌ను సాధించాడు. దీంతో అందరూ ఇప్పుడు పొగడ్తలు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీని విపరీతంగా అభిమానించే వారిలో పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar) ముందుంటాడు. తానెందుకు విరాట్‌ ప్రదర్శనను మెచ్చుకుంటానో ఓ చర్చ సందర్భంగా వివరించాడు.

‘‘క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌ అని నమ్ముతా. కానీ, కెప్టెన్‌గా మాత్రం అతడు విఫలమయ్యాడు. దాంతో సారథ్య బాధ్యతలనే వదిలేశాడు. ఇకపోతే నా స్నేహితుడైన విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటం చాలా ఇష్టం. అతడి విషయంలోనూ ఇలానే జరిగింది. ఎప్పుడైతే కెప్టెన్సీ భారం లేకుండా స్వేచ్ఛగా ఆడటం మొదలు పెట్టాడో.. ఫామ్‌లోకి వచ్చేశాడు. అందుకు గత టీ20 ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శన చూస్తే అర్థమైపోతుంది. అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని చెప్పడానికే ఆ టోర్నమెంట్‌ అక్కరకొచ్చేలా ఆ దేవుడు చేశాడు. మరొక విషయం.. విరాట్ కోహ్లీని ఎందుకు ఎక్కువగా పొగుడుతుంటావు? అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నేనెందుకు మెచ్చుకోకూడదని తిరిగి నేనే వారిని అడుగుతా. ఒక్కసారి విరాట్ రికార్డులు గమనించండి.. అతడు సాధించిన సెంచరీల్లో 40కిపైగా కేవలం ఛేదన సమయంలోనే చేశాడు. ఒకానొక దశలో భారత్‌ విజయం సాధించడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు’’ అని షోయబ్ తెలిపాడు. విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 74 శతకాలను సాధించాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు