Asia Cup: ఆసియా కప్‌ 2023.. కుదిరితే పాక్‌లో.. లేకపోతే శ్రీలంకలో నిర్వహించాలి: అక్తర్

ఐసీసీ ప్రతి సంవత్సరం మినీ, మెగా టోర్నీలను నిర్వహిస్తూనే ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం ఆసియా కప్‌ (Asia Cup 2023) నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Published : 16 Mar 2023 15:01 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌  (Asia Cup 2023) నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ (ACC) సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం ఇంకా వెలువడలేదు. పాక్‌లో ఆడేది లేదని బీసీసీఐ ఇప్పటికే కరాఖండిగా చెప్పేసింది. అలాగని భారత్‌ లేకుండా ఆసియా కప్‌ను నిర్వహిస్తే పాకిస్థాన్‌కు ఆదాయపరంగా ఇబ్బంది తప్పదు. ఆసియా కప్‌ టోర్నీనే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025  నిర్వహణ కూడా పాకిస్థాన్‌దే కావడం గమనార్హం. భారత్ - పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌ లేకుండా ఈ టోర్నీలను నిర్వహిస్తే ప్రేక్షకాదరణ పడిపోవడం ఖాయం. అందుకే దాయాదులపోరాటం ఉండాల్సిందేనని, వేదికనైనా మార్చాలని పాక్‌ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌ పాక్‌లో జరగాలని నేను కోరుకుంటా. కానీ, అలా కుదరకపోతే కనీసం శ్రీలంకలోనైనా టోర్నీని నిర్వహించాలి. ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్ - పాకిస్థాన్‌ జట్లను చూడాలి. ప్రపంచ క్రికెట్‌లో దాయాదుల జట్ల మధ్య జరిగే ఫైనల్‌కు మించిన మ్యాచ్‌ ఇంకేం ఉండదు’’ అని అక్తర్‌ తెలిపాడు. మార్చినెలలోనే జరిగే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ రెండో దఫా సమావేశాల్లో వేదికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తొలుత భారత్ ఆడే  మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, వాటిని ఏసీసీ ధ్రువీకరించలేదు. పాక్‌ మాజీ ఆటగాళ్లు మాత్రం తమ దేశంలోనే టోర్నీ జరగాలని, భారత్‌ పాల్గొనాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం పాక్‌ వెళ్లకూడదని సూచనలు చేశారు. వారికి భిన్నంగా షోయబ్‌ అక్తర్‌ స్పందించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని