MS Dhoni: ధోనీ వచ్చే సీజన్‌ కచ్చితంగా ఆడాలి.. కనీసం అందులోనైనా భాగమవ్వాలి: అక్తర్‌

 కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా వైదొలగడంతో మళ్లీ ఎంఎస్ ధోనీ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో ధోనీ సారథ్యంలో మూడు మ్యాచ్‌లను...

Published : 10 May 2022 02:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా వైదొలగడంతో మళ్లీ ఎంఎస్ ధోనీ చెన్నై జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో ధోనీ సారథ్యంలో మూడు మ్యాచ్‌లను చెన్నై ఆడగా.. రెండింటిలో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ భారీ విజయాలు నమోదు చేస్తే ప్లేఆఫ్స్ అవకాశాలూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న ఒకటే.. 40 ఏళ్ల ధోనీ వచ్చే సీజన్‌లో అందుబాటులో ఉంటాడా..? లేదా..? దీనిపై పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ తన అభిప్రాయం వెల్లడించాడు.

‘‘వచ్చే సీజన్‌లో ధోనీ ఉంటాడా..? లేదా అనేది ప్రతి అభిమాని ఆలోచిస్తూ ఉంటాడు. కనీసం చెన్నై మేనేజ్‌మెంట్‌లోనైనా భాగం కావాలని కోరుకుంటారు. అయితే ధోనీ ఏం చేస్తాడనేది ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. టీమ్ఇండియా కోసం ధోనీ చేసిన సేవలకు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. గౌరవిస్తూనే ఉంటాం. ఆటకు పూర్తిగా వీడ్కోలు పలకడానికి ముందు కచ్చితంగా వచ్చే సీజన్‌ను ఆడతాడని నేను భావిస్తున్నా. కనీసం చెన్నై మేనేజ్‌మెంట్‌లో అయినా భాగం కావచ్చు. ధోనీ, కోహ్లీ ఓ బ్రాండ్‌. వాళ్లిద్దరూ ఫ్రాంఛైజీ కంటే ఎక్కువ. ఇప్పటికే ధోనీ యువ ఆటగాళ్లకు చాలా మంచి అవకాశాలు కల్పించాడు. వారి కోసం లోయర్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ధోనీ వచ్చే ఏడాది కూడా అద్భుతంగా పునరాగమనం చేయాలని కోరుకుంటా’’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని