T20 World Cup: షహీన్.. కొంచెం బుర్ర ఉపయోగించాల్సింది : షాహిద్ అఫ్రిది

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంపై పాక్ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది స్పందించాడు.

Published : 13 Nov 2021 14:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంపై పాక్ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది స్పందించాడు. షహీన్ షా కొంచెం బుర్ర ఉపయోగించి తెలివిగా బౌలింగ్ చేయాల్సిందని అన్నాడు. క్రీజులో ఉన్న మాథ్యూ వేడ్.. షహీన్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సులు బాది ఆసీస్‌ని విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ‘రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షహీన్ బౌలింగ్‌ చేసిన తీరు పట్ల కొంచెం అసంతృప్తి ఉంది. హసన్‌ అలీ క్యాచ్ జారవిడిచినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. షహీన్ బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది.  కొంచెం బుర్ర ఉపయోగించి తెలివిగా బౌలింగ్‌ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో! అయితే, ఈ టోర్నీలో అతడు గొప్పగా రాణించాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే.. భవిష్యత్తులో మరింత మెరుగైన బౌలర్‌గా రాణించగలడు’ అని షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు.

గెలుపును స్వాగతించినట్లే.. ఓటమిని హుందాగా స్వీకరిస్తామని మరో పాక్ మాజీ క్రికెటర్‌ ఇంజమామ్‌-ఉల్-హక్‌ అన్నాడు. తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పాడు. ‘పాకిస్థాన్‌ తరఫున నేను ఆరు ప్రపంచకప్‌ల్లో పాల్గొన్నాను. ఓడిపోతే ఏం జరుగుతుందో అనే భయం మాకు కూడా ఉండేది. 1999లో ప్రపంచకప్ ఫైనల్లో మేం ఓడిపోయినప్పుడు.. చాలా విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. క్రికెట్లో ఆస్ట్రేలియా చాలా విజయవంతమైన జట్టు. వాళ్లు గెలిచినప్పుడు అభిమానులు ఎలా ఆదరిస్తారో.. ఓడిపోయినప్పుడు కూడా అలాగే జట్టుకు అండగా నిలబడతారు. 1996 ప్రపంచకప్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఓడిపోయినప్పుడు ఆ దేశ అభిమానులు.. విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. మేం కూడా అలాగే మా ఆటగాళ్లను స్వాగతిస్తాం. వారికి అండగా నిలబడతాం. గెలుపును స్వాగతించినట్లే.. ఓటములను కూడా హుందాగా స్వీకరిస్తాం. మా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది ’ అని ఇంజమామ్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్ టైటిల్ పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఆదివారం తలపడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని