Shreyas Iyer: ఆరోజు నేనెందుకు మా సీఈవో పేరు తెచ్చానంటే..?

కోల్‌కతా తుది జట్టు విషయంలో తమ యజమాని పాత్ర కూడా ఉంటుందంటూ గతవారం సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా ఆ విషయంపై స్పష్టతనిచ్చాడు...

Published : 16 May 2022 01:58 IST

సీఈవోపై స్పందించిన శ్రేయస్‌ అయ్యర్‌

పుణె: కోల్‌కతా తుది జట్టు విషయంలో తమ యజమాని పాత్ర కూడా ఉంటుందంటూ గతవారం సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా ఆ విషయంపై స్పష్టతనిచ్చాడు. గతరాత్రి హైదరాబాద్‌పై విజయం సాధించిన అనంతరం అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా అప్పుడు తాను ఎందుకు కోల్‌కతా సీఈవో పేరు తెచ్చానో వివరించాడు. ‘నేనిక్కడ ఒక విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. గతమ్యాచ్‌లో నేను సీఈవో పేరు ప్రస్తావించాను. నా ఉద్దేశం ఏమిటంటే.. ఆయన తుది జట్టులో అవకాశాలు రాని ఆటగాళ్లతో కలిసి మాట్లాడి పరిస్థితులను వివరించే పనిలో ఉన్నారు. కొన్నిసార్లు మేం తుది జట్టును ఎంపిక చేయడం కూడా కష్టంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు.

ఇక హైదరాబాద్‌పై విజయం సాధించడంతో ఇంకా ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవడంపైనా శ్రేయస్‌ మాట్లాడాడు. ‘ఈ గేమ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో వచ్చాం. అంత దృఢంగా మానసిక నిర్ణయం తీసుకున్నాం. మా ఆటగాళ్లు భయం లేకుండా అద్భుతంగా ఆడారు. ఇక టాస్‌ గెలవడం కూడా ఇక్కడ ముఖ్యమైనదే. పుణెలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే ఎక్కువగా గెలిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాం. దీంతో ప్రణాళికా బద్దంగా ఆడాం. మా బ్యాటింగ్‌లో వీలైనంత ఎక్కువగా రసెల్‌కు ఆడే అవకాశం కల్పించాం. సామ్‌ కూడా బాగా ఆడాడు. ఇక చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడతామని ఆశిస్తున్నా. ఈ స్లో వికెట్‌పై సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి గొప్పగా బౌలింగ్‌ చేసి కీలక వికెట్లు తీశారు. దీంతో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టడి చేశాం’ అని వివరించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లకు 177/6 స్కోర్‌ సాధించింది. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 123/8తో నిలిచి వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. దీంతో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు ముగిసినట్లే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని