IPL 2022 : శ్రేయస్‌ అయ్యర్‌ కోసం ఆ ఫ్రాంఛైజీలు ఎగబడతాయి : ఆకాశ్‌ చోప్రా

త్వరలో నిర్వహించనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలంలో టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని మాజీ..

Published : 02 Feb 2022 17:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : త్వరలో నిర్వహించనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలంలో టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కోల్‌కతా లేదా బెంగళూరు జట్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంటాయని జోస్యం చెప్పాడు. గత సీజన్‌ (ఐపీఎల్-2021) వరకు అయ్యర్ దిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) తరఫున ఆడిన విషయం తెలిసిందే. భుజం గాయం కారణంగా తొలి విడత ఐపీఎల్‌కు శ్రేయస్‌ దూరం కావడంతో.. రిషభ్‌ పంత్‌కి కెప్టెన్సీ అప్పగించారు. దుబాయ్‌లో జరిగిన రెండో విడత ఐపీఎల్‌కు శ్రేయస్‌ అందుబాటులోకి వచ్చినా.. పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించారు. దీంతో శ్రేయస్‌ బహిరంగ వేలంలోకి వచ్చాడు.    

‘శ్రేయస్‌ అయ్యర్ గొప్ప ఆటగాడు. జట్టుని సమర్థంగా నడిపించగలడు. అందుకే అతడిని దక్కించుకునేందుకు త్వరలో నిర్వహించనున్న వేలంలో తీవ్ర పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల యాజమాన్యాలు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఎంతైనా వెచ్చించి శ్రేయస్‌ అయ్యర్‌ని సొంతం చేసుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, విదేశీ ఆటగాళ్లు కగిసో రబాడ, క్వింటన్‌ డికాక్‌, డేవిడ్‌ వార్నర్‌ తదితరులు భారీ ధర పలికే అవకాశముంది’ అని ఆకాశ్‌ చోప్రా అంచనా వేశాడు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో పాల్గొననున్న ఆటగాళ్ల జాబితాను ఇటీవలే బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం 590 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని