IND vs SA: కావాలనే డీకే కన్నా ముందు అక్షర్‌ పటేల్‌ను పంపాం: శ్రేయస్

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దినేశ్‌ కార్తీక్‌ కన్నా ముందు అక్షర్‌ పటేల్‌ను మైదానంలోకి పంపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి...

Published : 14 Jun 2022 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దినేశ్‌ కార్తీక్‌ కన్నా ముందు అక్షర్‌ పటేల్‌ను మైదానంలోకి పంపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమ్‌ఇండియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. డీకే లాంటి హిట్టర్‌ను కాదని అక్షర్‌ను ఎందుకు పంపారని మండిపడ్డారు. అయితే, మ్యాచ్‌ అనంతరం ఈ విషయంపై శ్రేయస్‌ అయ్యర్‌ స్పష్టత ఇచ్చాడు.

‘పరిస్థితులకు తగ్గట్టు ఆడేలా ఈ నిర్ణయం మేం ముందే తీసుకున్నాం. అక్షర్‌ క్రీజులోకి వచ్చేటప్పటికి ఏడు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో మేం సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేసే బ్యాట్స్‌మన్‌ కావాలనుకున్నాం కానీ, వచ్చీ రాగానే ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడాలని కోరుకోలేదు. దినేశ్‌ కార్తీక్‌ కూడా స్ట్రైక్‌ రొటేట్‌ చేయగల ఆటగాడే అయినా.. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుందని మేం భావించాం. డీకే కూడా క్రీజులోకి వచ్చాక మొదట కాస్త ఇబ్బందిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో పిచ్‌ అలాంటి ప్రభావం చూపించింది. అయితే, ఇదే ప్రణాళికను మేం రాబోయే మ్యాచ్‌లోనూ అమలు చేస్తామని అనుకుంటున్నా. ఇంతకుముందూ మేం ఇలాగే చేశాం. కానీ, ఈ మ్యాచ్‌లో సరిగ్గా కుదరలేదు’ అని శ్రేయస్‌ వివరించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 148/6 స్కోర్‌ సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. ఈ క్రమంలోనే 13వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్య (9) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ 11 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇక 14వ ఓవర్‌లో శ్రేయస్‌(41) ఔటయ్యాక బరిలోకి దిగిన డీకే (30; 21 బంతుల్లో 2x4, 2x6) జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు టీమ్‌ఇండియా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు