Published : 24 Mar 2022 01:23 IST

IPL 2022: శ్రేయస్‌ సహజంగానే గొప్ప నాయకుడు: డేవిడ్ హస్సీ

ఇంటర్నెట్ డెస్క్‌: కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌) కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌పై ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. శ్రేయస్‌ సహజంగానే గొప్ప నాయకుడని పేర్కొన్నాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న అతడికి మరింత స్వేచ్ఛ ఇస్తే చాలని హస్సీ అభిప్రాయపడ్డాడు.

‘శ్రేయస్ అయ్యర్‌లో సహజంగానే నాయకత్వ లక్షణాలున్నాయి. దిల్లీ కెప్టెన్‌గా గతంలో శ్రేయస్‌ అయ్యర్ గొప్పగా రాణించాడు. ఆటపై అతడికి మంచి అవగాహన ఉంది. శ్రేయస్ లాంటి యువ ఆటగాడిని కెప్టెన్‌గా నియమించడం కేకేఆర్‌ యాజమాన్యం తీసుకున్న గొప్ప నిర్ణయం. ప్రస్తుతం శ్రేయస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడిని పట్టించుకోనవసరం లేదు. స్వేచ్ఛనిస్తే చాలు. ఆస్ట్రేలియా పేసర్‌ పాట్ కమ్మిన్స్ వైస్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌కు తోడుగా ఉన్నాడు. అవసరమైతే కమ్మిన్స్‌ కూడా జట్టును ముందుండి నడిపించగలడు’ అని డేవిడ్‌ హస్సీ అన్నాడు.

‘అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవటం కాస్త ఆందోళన కలిగించే విషయమే. కానీ, అంతర్జాతీయ క్రికెట్ అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండటంతో.. తొలి ఐదు మ్యాచులకు పాట్‌ కమ్మిన్స్‌, ఆరోన్ ఫించ్‌ అందుబాటులో ఉండరు. ఆ తర్వాతి మ్యాచుల్లో ఇద్దరూ గొప్పగా రాణిస్తారనుకుంటున్నాను’ అని హస్సీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌ బయో బబుల్‌లో ఉండలేక ఐపీఎల్ ప్రారంభం కాకముందే లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఆరోన్‌ ఫించ్‌ కోల్‌కతా యాజమాన్యం జట్టులోకి తీసుకుంది.

‘అజింక్య రహానె చాలా అనుభవమున్న ఆటగాడు. అతడిలో ఇంకా చాలా క్రికెట్‌ మిగిలి ఉంది. గత కొద్ది కాలంగా అతడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే. కానీ, ట్రైనింగ్‌ సెషన్‌లో గొప్పగా రాణిస్తున్నాడు. రహనెలో మంచి నాయకుడు ఉన్నాడు. అలాగే, షెల్డన్‌ జాక్సన్‌, సామ్‌ బిల్లింగ్స్‌ లాంటి మెరుగైన ఆటగాళ్లు ఉండటం మాకు కలిసొచ్చే అంశం’ 

బౌలింగ్‌ విభాగం సమతూకంగా ఉంది..

‘ఉమేష్ యాదవ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. జట్టు కోసం కష్టపడి పనిచేస్తాడు. అతడితో పాటు టిమ్ సౌథీ, శివమ్‌ మావి, పాట్‌ కమిన్స్‌ వంటి ఫాస్ట్ బౌలర్లు మాకు అందుబాటులో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు కూడా ఉన్నారు. మొత్తం మీద బౌలింగ్ విభాగంలో మా జట్టు సమతూకంగా కనిపిస్తోంది’ అని డేవిడ్ హస్సీ చెప్పాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని