Shreyas Iyer : కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుకు యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని కేకేఆర్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా..

Updated : 16 Feb 2022 17:33 IST

KKR new captian shreyas iyer : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుకు యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని కేకేఆర్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలంలో కేకేఆర్‌ యాజమాన్యం అతడిని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

గతేడాది వరకు శ్రేయస్‌ అయ్యర్‌ దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తరఫున ఆడాడు. అయితే, గాయం కారణంగా గత సీజన్‌లో మొదటి విడత ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత దుబాయ్‌లో జరిగిన మలి దశ ఐపీఎల్‌కు శ్రేయస్‌ అందుబాటులోకి వచ్చినా.. దిల్లీ యాజమాన్యం రిషభ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. దీంతో శ్రేయస్‌ బహిరంగ వేలంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

గొప్ప గౌరవం దక్కింది: శ్రేయస్‌

కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక అవ్వడంపై శ్రేయస్‌ అయ్యర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘కేకేఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. వివిధ దేశాలకు చెందిన అత్యుత్తమ ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఒక చోట చేర్చింది. కెప్టెన్‌గా కేకేఆర్‌ జట్టును నడిపించేందుకు ఎదురు చూస్తున్నాను. జట్టు విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తాను. ఇంత గొప్ప అవకాశం కల్పించిన జట్టు యాజమాన్యం, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు’’ అని శ్రేయస్‌ అయ్యర్ అన్నాడు. 

‘‘బ్యాటింగ్‌ నైపుణ్యాలతో శ్రేయస్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. కేకేఆర్ నాయకుడిగా జట్టుని సమర్థంగా నడిపిస్తాడనే విశ్వాసం ఉంది’’ అని కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ పేర్కొన్నాడు. ‘‘భారత్‌కి చెందిన అత్య్తుత్తమ యువ ఆటగాళ్లలో ఒకడైన శ్రేయస్‌ అయ్యర్‌ కేకేఆర్‌ పగ్గాలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు నుంచే శ్రేయస్‌ ఆటతీరును, నాయకత్వ లక్షణాలను గమనించేవాడిని. ప్రస్తుతం అతడితో కలిసి పని చేసే సమయం వచ్చింది’’ అని కేకేఆర్ హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్ కల్లమ్‌ అన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని