
IND vs NZ: సునీల్ గావస్కర్ ఏం చెప్పాడంటే..! : శ్రేయస్ అయ్యర్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు సందర్భంగా.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్న అతడు ఘనంగా టెస్టు కెరీర్‌ను ఆరంభించాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అయ్యర్.. సునీల్ గావస్కర్ చెప్పిన సలహా ఏంటో బయట పెట్టేశాడు.
‘క్యాప్ అందిస్తున్న సమయంలో సునీల్ గావస్కర్ సర్ నన్ను చాలా మోటివేట్ చేశారు. భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. ఆటను ఎంజాయ్ చేయమని చెప్పారు. తొలుత రాహుల్ ద్రవిడ్ సర్ టెస్టు క్యాప్ అందిస్తారేమో అనుకున్నాను. అయితే, నేను ఊహించని విధంగా సునీల్ గావస్కర్ సర్ క్యాప్ అందించారు. ఇద్దరూ దిగ్గజ క్రికెటర్లే. ఇద్దరిలో ఎవరు క్యాప్ అందించినా గర్వకారణమే’ అని అయ్యర్ పేర్కొన్నాడు.
‘తొలి రోజు నా ఆట తీరు పట్ల పూర్తి సంతోషంగా ఉన్నాను. ఓవర్ నైట్ బ్యాటర్‌గా తొలి రోజు ఆట ముగించడంతో.. ఆ రోజు రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 5 గంటలకే లేచాను. సెంచరీ చేసిన తర్వాత కొంచెం కుదుటపడ్డాను. ఆ అనుభూతి మరిచిపోలేనిది’ అని అయ్యర్ అన్నాడు.
* సచిన్ ప్రశంసలు..
మరో వైపు, అరంగేట్ర టెస్టులోనే శతకంతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్‌పై భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ప్రశంసలు కురిపించాడు. ‘టెస్టు కెరీర్‌ను గొప్పగా ప్రారంభించావు శ్రేయస్ అయ్యర్. టీమ్ఇండియా టెస్టు క్రికెట్ జట్టులో నువ్వు కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అని సచిన్ ట్వీట్ చేశాడు. టీమ్ఇండియా తరఫున అరంగేట్ర టెస్టులోనే శతకం బాదిన 16వ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. రోహిత్ శర్మ, పృథ్వీ షా తర్వాత ఆడుతున్న తొలి టెస్టులోనే శతకం చేసిన మూడో ముంబయి ఆటగాడిగానూ శ్రేయస్ అయ్యర్ రికార్డ్ సృష్టించాడు.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.