Shreyas Iyer: నేనేం బాధపడట్లేదు.. ఇదో అత్యుత్తమ క్రికెట్‌ మ్యాచ్‌: శ్రేయస్

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో కోల్‌కతా పని పూర్తయింది. గతరాత్రి లఖ్‌నవూతో తలపడిన మ్యాచ్‌లో ఆ జట్టు 2 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది...

Updated : 19 May 2022 10:21 IST

(Photo: Shreyas Iyer Instagram)

ముంబయి: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో కోల్‌కతా కథ ముగిసింది. గతరాత్రి లఖ్‌నవూతో తలపడిన మ్యాచ్‌లో ఆ జట్టు రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. దీంతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా.. ఈసారి కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో లీగ్‌ దశకే పరిమితమైంది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అతడు.. ఈ ఓటమితో తానేం బాధపడట్లేదని చెప్పాడు. అత్యంత ఉత్కంఠభరితమైన స్థితిలో ముగిసిన ఈ గేమ్‌.. అత్యుత్తమ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఒకటని కొనియాడాడు.

‘ఈ గేమ్‌లో మేం చూపించిన ధైర్యం, పట్టుదల అత్యద్భుతమైనవి. రింకూసింగ్‌ ఆటతీరు చూసి ముచ్చటేసింది. అతడు మమ్మల్ని గెలుపు అంచుల దాకా తీసుకెళ్లినా.. చివరి రెండు బంతుల్లో దురదృష్టం వెంటాడింది. దాంతో అతడెంతో బాధపడుతున్నాడు. ఈ రోజు అతడు మమ్మల్ని గెలిపించి హీరో అవుతాడనుకున్నా. అయినా, అతడో మేటి ప్రదర్శన చేశాడు. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. మేం బ్యాటింగ్‌ మొదలు పెట్టినప్పుడు ఈ మాత్రం స్కోరైనా చేస్తామనుకోలేదు. ఇక్కడి పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయి. ఇది మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌. ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయినా వీలైనంత వరకు ఈ లక్ష్యాన్ని ఛేదించాలనే ప్రయత్నించాము. ఈ సీజన్‌ను బాగా ఆరంభించినా మధ్యలో ఐదు వరుస ఓటములతో దెబ్బతిన్నాం. అలాగే ఆటగాళ్ల ఫామ్‌, గాయాల కారణంగా పలుమార్లు జట్టులో మార్పులు చేయాల్సి వచ్చింది. అలా చేయడం వల్లే రింకూ సింగ్‌ వంటి ఆటగాడి గురించి తెలిసొచ్చింది’ అని శ్రేయస్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని