Shreyas Iyer: ధోనీ బ్యాటింగ్‌ చేస్తుంటే.. టెన్షన్‌గా ఉంటుంది.: శ్రేయస్

ధోనీ బ్యాటింగ్‌ చేస్తుంటే ఎప్పుడూ టెన్షన్‌గా ఉంటుందని కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో విజయం...

Published : 27 Mar 2022 12:47 IST

ముంబయి: ధోనీ బ్యాటింగ్‌ చేస్తుంటే ఎప్పుడూ టెన్షన్‌గా ఉంటుందని కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ ధోనీ బ్యాటింగ్‌పై ఇలా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత చెన్నై 131/5 స్కోర్‌ చేయగా.. కోల్‌కతా ఆ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అయితే, చెన్నై ఆ మాత్రం స్కోరైనా సాధించిందంటే అది ధోనీ (50 నాటౌట్‌; 38 బంతుల్లో 7x4, 1x6) బ్యాటింగ్‌ వల్లే.

‘ధోనీ అలా ధాటిగా ఆడుతుంటే ఆందోళనకు గురయ్యాను. తేమ కారణంగా ఎప్పుడైనా పరిస్థితులు వారికి అనుకూలంగా మారుతాయని నాకు తెలుసు. అలాంటి సమయంలో బంతిని పట్టుకోవడం చాలా కష్టం’ అని శ్రేయస్ వివరించాడు. ఇక కోల్‌కతా సారథిగా బాగుందని, కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. ఇకపై టోర్నీలో ఇలాగే వరుస విజయాలు కొనసాగించాలని ఉందన్నాడు. ఇక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఉమేశ్‌ యాదవ్‌పై స్పందిస్తూ.. అతడు నెట్స్‌లో బాగా కష్టపడ్డాడని, ప్రాక్టీస్‌ గేమ్స్‌లోనూ అద్భుతంగా రాణించాడని శ్రేయస్‌ పేర్కొన్నాడు. ఈరోజు రెండు వికెట్లు తీసి రాణించడం తనకు సంతోషంగా ఉందన్నాడు.

యాజమాన్యానికి కృతజ్ఞతలు: ఉమేశ్‌

ఉమేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ఇలా రాణించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘నేను చాలా కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడలేదు. అయినా, హెడ్‌కోచ్‌, కెప్టెన్‌ నాపై నమ్మకం ఉంచి తొలి మ్యాచ్‌లోనే తుది జట్టులోకి తీసుకున్నారు. నేను చాలా రోజులుగా టెస్టు క్రికెట్‌ ఆడటం వల్ల నా బౌలింగ్‌ యాక్షన్‌పై దృష్టిసారించాను. స్వింగ్‌ రాబట్టడానికి సరైన ప్రదేశాల్లో బంతులేయాలని కష్టపడ్డాను. ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా తొలి ఓవర్‌లోనే వికెట్‌ సాధించడం ద్వారా ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అది ఈరోజు జరిగింది. నేను ఎప్పుడైనా నా ఆటను, ప్రాక్టీస్‌ సెషన్లను చాలా సీరియస్‌గా తీసుకుంటా. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది’ అని ఉమేశ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని