IND vs NZ: రాహుల్‌ లేని ప్రభావం ఉండదు.. తుది జట్టులోకి శ్రేయస్‌ : అజింక్య రహానె

టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ టెస్టు క్రికెట్‌ అరంగేట్రం ఖాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో అతడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె..

Updated : 24 Nov 2021 16:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ టెస్టు క్రికెట్‌ అరంగేట్రం ఖాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో అతడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె ప్రకటించాడు. పలువురు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పించిన విషయం తెలిసిందే. తొడ గాయం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ ఈ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడిండింది. రాహుల్ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంది. అయితే, జట్టు బ్యాటింగ్‌ విభాగంలో సమతూకం కోసం శ్రేయస్ అయ్యర్‌ని కూడా జట్టులోకి తీసుకుంటున్నట్లు అజింక్య రహానె బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. తొలి టెస్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు.

గాయంతో కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ చోటు కల్పించింది. ఈ సందర్భంగా రాహుల్ లేని లోటు ఎలా ఉంటుందనే దానిపై కెప్టెన్‌ అజింక్య రహానె స్పందించాడు. కేఎల్‌ రాహుల్‌ లేకపోవడం దెబ్బేనని అయితే భారత ఓపెనింగ్‌ కాంబినేషన్‌ మీద ఆ ప్రభావం ఏమాత్రం పడబోదని రహానె స్పష్టం చేశాడు. టీమ్‌ఇండియా, కివీస్‌ జట్ల మధ్య తొలి టెస్టు గురువారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో రాహుల్‌ అద్భుతంగా రాణించాడని, అయితే ఈ సిరీస్‌కు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని రహానె పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాకు మంచి యువ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారని, వారిలో ఒకరు ఓపెనింగ్‌ స్థానాన్ని భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా రావడంపై రహానె స్పందిస్తూ.. ‘‘రాహుల్‌ ద్రవిడ్‌ ఒక్కటే చెప్పాడు. ఎక్కువ ఆలోచించకుండా మా శైలిలో ఆడాలని సూచించాడు. పుజారాకు, నాకు గేమ్‌ ప్లాన్‌ ఏంటో తెలుసు. దానిని మైదానంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ లేకపోవడం యువ క్రికెటర్లకు సదావకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి బాగా ఆడాలి. స్వేచ్ఛగా ఆడితే వాటంతటవే పరుగులు వచ్చేస్తాయి. అలానే ఇక్కడి పరిస్థితులు వేరు, దక్షిణాఫ్రికాలో పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి మేం మొదట కివీస్‌తో టెస్టు సిరీస్‌పైనే దృష్టిసారించాం’’ అని రహానె వివరించాడు. రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో.. మయాంక్ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. పేస్‌ విభాగంలో ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, స్పిన్ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లతో టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని