Shubman Gill: క్రికెట్‌లో సచిన్‌, విరాట్‌ల వారసత్వాన్ని గిల్‌ ముందుకు తీసుకెళ్లగలడు: సబా కరీం

యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌గిల్‌పై భారత మాజీ సెలెక్టర్‌ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 27 Jan 2023 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌లో సచిన్‌ తెందూల్కర్‌, విరాట్‌ కోహ్లి నెలకొల్పిన వారసత్వాన్నియువ బ్యాటర్‌ శుభ్‌మన్‌గిల్‌ ముందుకు తీసుకెళ్లగలడని భారత మాజీ సెలెక్టర్ సబా కరీం ఆశాభావం వ్యక్తం చేశాడు. గిల్‌ భవిష్యత్తులో భారత క్రికెట్‌కు అండగా నిలుస్తాడని అతడు పేర్కొన్నాడు.

‘‘గిల్‌ బ్యాటింగ్‌లో గొప్పగా రాణిస్తున్నాడు. మైదానంలో పరిస్థితులను అర్థం చేసుకొని విభిన్న షాట్లను ఆడే విధానం బాగుంది. చాలా రోజుల తర్వాత గిల్‌ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని చూస్తున్నా. క్రికెట్‌లో విరాట్‌కోహ్లి, సచిన్‌ తెందూల్కర్‌ నెలకొల్పిన వారసత్వాన్ని అతడు ముందుకు తీసుకెళ్లగలడు. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు అతడు అండగా నిలుస్తాడని ఆశిస్తున్నా. ఇక విదేశీ పర్యటనల్లో రాణించడమే అతడికి పెద్ద పరీక్ష. గతంలో ఇంగ్లాండ్‌లో ఆడిన టెస్టుల్లో అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. భవిష్యత్తులో బలమైన ప్రత్యర్థులతో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో గమనించాలి. ఇతర జట్ల నాణ్యమైన పేసర్ల బౌలింగ్‌లో, కఠినమైన పరిస్థితుల్లో అతను ఆటతీరును మెరుగుచేసుకుంటే అతనికి తిరుగుండదు’’ అని సూచించాడు.

భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో గిల్‌ అద్బుతంగా రాణించిన విషయం తెలిసిందే. తొలి వన్డేను ద్విశతకంతో ఆరంభించిన గిల్‌ రెండో మ్యాచ్‌లో 40, మూడో వన్డేలో 112 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో అతడు మొత్తం 360 పరుగులు చేశాడు. దీంతో ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌తో సమంగా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని