Published : 28 Jul 2022 10:01 IST

Shubman Gill: సెంచరీ చేద్దామనుకున్నా.. కానీ, వర్షం..: శుభ్‌మన్‌ గిల్

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో త్రుటిలో శతకం కోల్పోయిన టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్ (98 నాటౌట్‌; 98 బంతుల్లో 7x4, 2x6) తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ తాను శతకం బాదాలనుకున్నట్లు చెప్పాడు. కానీ, వర్షం అనేది తన చేతుల్లో లేనందున ఏమీ చేయలేకపోయానని చెప్పాడు. అలా వన్డేల్లో తన తొలి అంతర్జాతీయ శతకం కోల్పోయినట్లు గిల్‌ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో తాను ఔటైన తీరుకు నిరాశకు గురి చేసినట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే మూడో వన్డేలో ఎలాగైనా పట్టుదలగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. దీంతో తాను శతకం బాదాలనుకున్నానని.. అందుకు ఇంకొక్క ఓవర్‌ మిగిలి ఉంటే సరిపోయేదని చెప్పాడు. ఏదేమైనా తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉందని శుభ్‌మన్‌ వెల్లడించాడు.

కాగా, తొలి రెండు వన్డేల్లో 64, 43 పరుగులు చేసి అద్భుతంగా ఆడిన ఈ యువ ఓపెనర్‌ మూడో వన్డేలో మరింత పట్టుదలగా బ్యాటింగ్‌ చేశాడు. ఎలాగైనా వికెట్‌ కాపాడుకొని భారీ ఇన్నింగ్స్‌ ఆడాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ధావన్‌ (58; 74 బంతుల్లో 7x4)తో కలిసి శుభారంభం చేశాడు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 113 పరుగులు జోడించా ధావన్‌ ఔటయ్యాడు. అనంతరం శ్రేయస్‌ (44; 34 బంతుల్లో 4x4, 1x6)తో కలిసి బ్యాటింగ్‌ కొనసాగించిన శుభ్‌మన్‌గిల్‌ మరింత ధాటిగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించి మరో విలువైన భాగస్వామ్యం నిర్మించారు. అయితే, శ్రేయస్‌ కూడా అర్ధ శతకానికి చేరువయ్యాక ఔటయ్యాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్‌.. సూర్యకుమార్‌ (8), సంజూ(6)తో కలిసి బ్యాటింగ్‌ కొనసాగించాడు. అయితే, 36 ఓవర్లు పూర్తయ్యాక అతడు శతకానికి రెండు పరుగుల దూరంలో ఉండగా రెండోసారి వర్షం కురిసింది. దీంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అంతకుముందే రెండు గంటలకు పైగా వర్షం కారణంగానే ఆటను నిలిపివేయడంతో అక్కడితో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో శుభ్‌మన్‌ 98 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచి తొలి సెంచరీని సాధించలేకపోయాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts