Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ను సచిన్, కోహ్లీలతో పోల్చడం సరికాదు: భారత మాజీ కోచ్

కెరీర్ మొదట్లోనే శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ను సచిన్‌ తెందూల్కర్‌, కోహ్లీతో పోల్చడం సరికాదని భారత మాజీ హెడ్ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ పేర్కొన్నాడు.

Updated : 03 Jun 2023 15:15 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఆరంభం నుంచి శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) పేరు భారత క్రికెట్‌లో మార్మోగుతోంది.  ఏ ఫార్మాట్ క్రికెటైనా గిల్ పరుగుల వరద పారిస్తుండటమే ఇందుకు గల కారణం. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ (IPL 2023)లోనూ గిల్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో 17 మ్యాచ్‌లు ఆడి 890 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో గిల్‌ ఆటతీరుపై పలువురు మాజీలతోపాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడిని సచిన్‌ తెందూల్కర్‌, విరాట్‌ కోహ్లీలతో పోలుస్తున్నారు. అయితే, గిల్‌ను అప్పుడే కోహ్లీ, సచిన్‌తో పోల్చడాన్ని భారత మాజీ హెడ్‌ కోచ్‌, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ మెంటార్‌ గ్యారీ కిర్‌స్టన్‌ (Gary Kirsten) తప్పుబట్టాడు. కెరీర్ మొదట్లోనే ఈ యువ ఆటగాడిని ఆ ఇద్దరితో పోల్చడం సరికాదని పేర్కొన్నాడు. అదే సమయంలో, గిల్‌పై కిర్‌స్టన్‌ ప్రశంసలు కురిపించాడు. శుభ్‌మన్‌కు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడే సత్తా ఉందన్నాడు. 

‘‘శుభ్‌మన్‌ గిల్ ఓ యువ ఆటగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడానికి కావాల్సిన అద్భుతమైన నైపుణ్యం, సంకల్పం అతని దగ్గర ఉన్నాయి. కానీ, కెరీర్ ఆరంభంలోనే అతడిని సచిన్, కోహ్లీలతో పోల్చడం సరికాదు. భారత్‌ తరఫున గిల్‌ అన్ని ఫార్మాట్లలోనూ సక్సెస్ అవుతాడని నమ్ముతున్నాను. టీ20 క్రికెట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇలాంటి క్రికెటర్లను మనం తరచూ చూడలేం. భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో గొప్ప ప్లేయర్ అయ్యే లక్షణాలు శుభ్‌మన్‌ గిల్‌లో ఉన్నాయి. అయితే, ప్రతి ప్లేయర్ ఎదుర్కొనే సవాళ్లు, అడ్డంకులను అతను ఎలా అధిగమిస్తాడన్నది అతని దీర్ఘకాల సక్సెస్‌ను నిర్ణయిస్తుంది. అతనికి నేను చెప్పేదొక్కటే ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి’’ గ్యారీ కిర్‌స్టన్‌ వివరించాడు. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్.. ఈ నెల 7న  ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ (WTC Final) ఫైనల్‌లో ఇదే జోరు కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అతడు రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని