GT vs MI: టెక్నికల్‌గా మారా.. నా బెస్ట్‌ ఐపీఎల్ ఇన్నింగ్స్‌ ఇదే: శుభ్‌మన్‌ గిల్

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) మూడో సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్ ఆరెంజ్‌ క్యాప్‌ను పూర్తిగా సొంతం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్‌ (GT) ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో తన రెండో టైటిల్‌ కోసం గుజరాత్ తలపడనుంది.

Published : 27 May 2023 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) రెండో క్వాలిఫయర్‌లో ముంబయిపై గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (129) అదిరిపోయే సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో మూడో శతకం చేసిన ఈ టైటాన్స్‌ ఓపెనర్‌.. గుజరాత్ భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్‌ క్యాప్‌ కూడా గిల్ (851 పరుగులు) వద్దే ఉంది. ఈ సందర్భంగా ముంబయిపై విజయం సాధించిన తర్వాత శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ టెక్నికల్‌గా మార్పులు చేసుకోవడం వల్లే అమూల్యమైన ఇన్నింగ్స్‌ ఆడగలిగినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అని పేర్కొన్నాడు.

‘‘ఈ ఏడాది వెస్టిండీస్‌ టూర్‌ నుంచి నా బ్యాటింగ్‌లో టెక్నికల్‌గా మార్పులు చేసుకుంటూ వచ్చా. గత ఐపీఎల్‌ సీజన్‌కు ముందు గాయపడ్డా. అయినా, నా గేమ్‌పై దృష్టిపెట్టా.  టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు నా బ్యాటింగ్‌పై చాలా శ్రమించా. అదే ఇప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడేందుకు దోహదపడుతోంది. ప్రతి ఒక్కరిపై అంచనాలు ఉంటాయి. కానీ, నేను మైదానంలోకి దిగాక వాటిని అస్సలు పట్టించుకోను. జట్టు కోసం ఏం చేయాలనేదానిపైనే ఆలోచిస్తా. ఒక బంతి తర్వాత మరో బంతిని ఎలా ఆడాలి....? ఈ ఓవర్‌ పూర్తయ్యాక కొత్త ఓవర్‌లో ఎలా పరుగులు రాబట్టాలి? అనే ధోరణితోనే ఆడతా. ముంబయితో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో మూడు సిక్స్‌లు కొట్టడంతో ఊపు వచ్చింది. దీంతో ఇవాళ నాదే అనిపించింది.

వర్షం పడినప్పటికి ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు బాగుంది. బంతిని అర్థం చేసుకుని నమ్మకంతో ఆడితే పరుగులు రాబట్టవచ్చని తెలిసింది. ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఈ సీజన్‌ నాకు అద్భుతమైంది. మంచి ఆరంభం లభిస్తే భారీ స్కోరు చేయగలననే నమ్మకం నాకుంది. ఒక్కసారి మూమెంట్‌ వస్తే ఆటోమేటిక్‌గా పరుగులు వచ్చేస్తాయి’’ అని గిల్ తెలిపాడు.

ప్రశంసల వర్షం..

ఐపీఎల్ సీజన్‌లో మూడు సెంచరీలు బాదడంపై క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభ్‌మన్‌ గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విరాట్ కోహ్లీతో గిల్‌ను పోలుస్తూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, రిషభ్‌ పంత్, ఏబీ డివిలియర్స్‌, సురేశ్‌ రైనా అభినందనలు తెలిపారు. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా స్టోరీలో శుభ్‌మన్‌ గిల్ ఫొటోను షేర్‌ చేసి ‘స్టార్’ సింబల్‌ పెట్టాడు.

‘‘భారత క్రికెట్‌ నూతన యువరాజు నుంచి మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌’’ - యువీ

‘‘యువ క్రికెటర్‌ నుంచి సూపర్‌ సెంచరీ. భారత క్రికెట్‌ భవిష్యత్ తారగా వెలుగొందుతావు. ఇలాంటి గేమ్‌ను కొనసాగించు’’ - సురేశ్‌ రైనా

‘‘ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలిసిన ఆటగాడు. నిలకడగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించి దూకుడు పెంచడంలో దిట్ట. అతి పెద్ద మైదానం అహ్మదాబాద్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రతి ఒక్కరూ దీనిని గుర్తు పెట్టుకోవాలి. సూపర్‌గా ఆడావు శుభ్‌మన్‌ గిల్. ప్రశంసించడానికి మాటలు కూడా దొరకడం లేవు’’ - ఏబీ డివిలియర్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని