Shubman Gill: క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్‌ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్‌ కోచ్‌ ఏమన్నారంటే..

టీమ్‌ ఇండియా ట్రావెలింగ్‌ రిజర్వులో ఉన్న గిల్‌ను ప్రపంచకప్‌ టోర్నీ నుంచి వెనక్కి పంపడంపై బ్యాటింగ్‌ కోచ్‌ వివరణ ఇచ్చారు. 

Updated : 16 Jun 2024 13:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌-8 దశకు చేరుకున్నాక.. ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఉన్న స్టార్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (Shubman Gill), అవేష్‌ఖాన్‌ ( Avesh Khan)ను భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా టీమ్‌ ఇండియా ఈ నిర్ణయం ఎందుకు తీసుకొందో అర్థం కాక.. ఫ్యాన్స్‌ గందరగోళానికి గురయ్యారు. కొందరు మరో అడుగు ముందుకేసి.. గిల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారానికి తెరతీశారు. గతంలో ఇషాన్‌ కిషన్‌ను కూడా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వెనక్కి పంపించారు. ఆ తర్వాత అతడు పూర్తిగా జట్టుకు దూరమైపోయాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ ప్రచారానికి తాజాగా జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ తెరదించాడు. అసలు గిల్‌ను యాజమాన్యం ఎందుకు వెనక్కి పంపిందో వివరించాడు.

జట్టు కరేబియన్‌లో మ్యాచ్‌లు ఆడే సమయానికి ఇద్దరు రిజర్వు ఆటగాళ్లను మాత్రమే ఉంచాలని మేనేజ్‌మెంట్‌ ఎప్పుడో నిర్ణయించిందని రాథోడ్‌ పేర్కొన్నాడు. ‘‘ఇది మొదట్లో అనుకున్న ప్రణాళికే. అమెరికాకు వచ్చే సమయానికి నలుగురు ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ఆటగాళ్లు ఉండాలనుకొన్నాం. ఆ తర్వాత వెస్టిండీస్‌కు వెళ్లేటప్పుడు ఇద్దరు ఆటగాళ్లను రిలీజ్‌ చేయాలని భావించాం. ఇది జట్టు ఎంపిక సమయంలో ముందస్తుగా నిర్ణయించిన ప్లాన్‌.. దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నాం. అమెరికా మైదానాలపై ఆడే సమయంలో ఆటగాళ్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లను సిద్ధంగా ఉంచాం. ఇప్పుడు జట్టు సూపర్‌-8కు చేరుకొంది’’ అని పేర్కొన్నారు. 

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ రిజర్వ్‌ ఆటగాళ్లు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్, పేసర్‌ అవేష్‌ఖాన్‌ జట్టు నుంచి విడుదలయ్యారు. శనివారం కెనడాతో చివరి గ్రూపు మ్యాచ్‌ తర్వాత జట్టు మేనేజ్‌మెంట్‌ వీరిద్దరిని స్వదేశానికి పంపించింది. సూపర్‌-8 దశలో నలుగురు స్టాండ్‌ బై ఆటగాళ్లు అవసరం లేదని భావిస్తున్న జట్టు మేనేజ్‌మెంట్‌.. రింకూ సింగ్, ఖలీల్‌ అహ్మద్‌లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. ‘‘అమెరికాలో గ్రూపు దశ వరకే గిల్, అవేష్‌ ఉండాలని ముందుగానే నిర్ణయించాం. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ తర్వాత వాళ్లిద్దరినీ విడుదల చేయనున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు కూడా గతంలో తెలిపాయి. ఒకవేళ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల్లో ఎవరైనా గాయపడితే 15 మంది సభ్యుల జట్టులోని ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌తో ఆ లోటును భర్తీ చేయాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని