India Beat zimbabwe: గిల్‌ కొట్టగా.. సుందర్‌ పడగొట్టగా..

జింబాబ్వే పర్యటనలో టీమ్‌ఇండియా జోరు కొనసాగిస్తోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ శుభ్‌మన్‌ సేన మూడో టీ20లోనూ ఆతిథ్య జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. బ్యాటుతో కెప్టెన్‌ గిల్, రుతురాజ్‌.. బంతితో వాషింగ్టన్‌ సుందర్‌ సత్తా చాటారు.

Updated : 11 Jul 2024 07:14 IST

మూడో టీ20లో జింబాబ్వేపై భారత్‌ విజయం 
సిరీస్‌లో 2-1తో ఆధిక్యం
హారారె

జింబాబ్వే పర్యటనలో టీమ్‌ఇండియా జోరు కొనసాగిస్తోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ శుభ్‌మన్‌ సేన మూడో టీ20లోనూ ఆతిథ్య జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. బ్యాటుతో కెప్టెన్‌ గిల్, రుతురాజ్‌.. బంతితో వాషింగ్టన్‌ సుందర్‌ సత్తా చాటారు.

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యం సంపాదించింది. మరోసారి చెలరేగిన భారత్‌ బుధవారం మూడో టీ20లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గిల్‌ (66; 49 బంతుల్లో 7×4, 3×6), రుతురాజ్‌ గైక్వాడ్‌ (49; 28 బంతుల్లో 4×4, 3×6), యశస్వి జైస్వాల్‌ (36; 27 బంతుల్లో 4×4, 2×6) మెరవడంతో మొదట భారత్‌ 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఛేదనలో జింబాబ్వే 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. వాషింగ్టన్‌ సుందర్‌ (3/15), అవేష్‌ ఖాన్‌ (2/39) జింబాబ్వేను దెబ్బతీశారు. మైయర్స్‌ (65 నాటౌట్, 49 బంతుల్లో 7×4, 1×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 శనివారం జరుగుతుంది.

తేలిపోయిన జింబాబ్వే: ఛేదనలో జింబాబ్వే తేలిపోయింది. ఏ దశలోనూ ఆ జట్టు విజయం కోసం రేసులో లేదు. భారత్‌ గెలుపు అంతరం తక్కువగా అనిపించినా.. జింబాబ్వే ఓటమి చాలా ముందే ఖరారైంది. భారత బౌలర్ల ధాటికి 39 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే త్వరగానే చిక్కుల్లో పడింది. రెండో ఓవర్లో ఓపెనర్‌ మధెవెర్‌ (1)ను వెనక్కి పంపిన అవేష్‌.. తన తర్వాతి ఓవర్లో బెనెట్‌ (4)నూ ఔట్‌ చేశాడు. ఈ మధ్య మరుమాని (13)ని ఖలీల్‌ (1/15) పెవిలియన్‌ చేర్చాడు. జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన కెప్టెన్‌ సికందర్‌ రజా (15)తో పాటు క్యాంప్‌బెల్‌ (1)ను ఒకే ఓవర్లో ఔట్‌ చేయడం ద్వారా జింబాబ్వేను వాషింగ్టన్‌ సుందర్‌ దెబ్బతీశాడు. ఆ దశలో మడాండె (37; 26 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి మైయర్స్‌ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరూ ఆరో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. కానీ ఈ భాగస్వామ్యం జింబాబ్వేకు పరాభవాన్ని తప్పించడానికి ఉపయోగపడిందే కానీ.. ఆ జట్టుకు గెలుపు అవకాశాన్ని సృష్టించలేదు. మడాండె 17వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికే భారత్‌ విజయం ఖాయమైనా.. మైయర్స్‌ చెలరేగడంతో ఆఖరి రెండు ఓవర్లలో జింబాబ్వే 34 పరుగులు రాబట్టింది.

మెరిసిన శుభ్‌మన్, రుతురాజ్‌: 49/0. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా నాలుగు ఓవర్లలో చేసిన స్కోరిది. ఓపెనర్లు జైస్వాల్, గిల్‌ బ్యాట్లు ఝళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బెనెట్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌ బాదిన జైస్వాల్‌.. మూడో ఓవర్లో చటార బౌలింగ్‌లో వరుసగా 4, 6 దంచేశాడు. మరోవైపు గిల్‌ కూడా మూడు ఫోర్లు, సిక్స్‌తో జోరు మీద కనిపించాడు. ఎదుర్కొన్న తొలి 12 బంతుల్లో జైస్వాల్‌ 25 పరుగులు చేయగా.. తొలి 13 బంతుల్లో గిల్‌ 23 పరుగులు సాధించాడు. కానీ అయిదో ఓవర్‌ నుంచి స్కోరు వేగం మందగించింది. బ్యాటర్లు పెద్ద షాట్లు ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. పదో ఓవర్‌ వరకు మరో మూడు ఫోర్లు మాత్రమే కొట్టిన భారత్‌.. జైస్వాల్‌ వికెట్‌ను కోల్పోయి 80/1తో నిలిచింది. ఓపెనర్‌గా గత మ్యాచ్‌లో సెంచరీ కొట్టి ఈసారి మూడో స్థానంలో దిగిన అభిషేక్‌ (10) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. రుతురాజ్‌ వచ్చాక గిల్‌ మళ్లీ జోరు పెంచాడు. మధెవర్‌ బౌలింగ్‌లో సిక్స్, చటార ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. రుతురాజ్‌ కూడా బ్యాట్‌ ఝళిపించడంతో భారత్‌ 15 ఓవర్లలో 127/2తో నిలిచింది. 16వ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. అయితే ఆఖరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు రావడంతో భారత్‌ స్కోరు 180 దాటింది. గిల్‌ 18వ ఓవర్లో వెనుదిరగగా.. జోరు కొనసాగిస్తూ కొన్ని చక్కని షాట్లు ఆడిన రుతురాజ్‌ ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. సంజు శాంసన్‌ 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ ఆసాంతం జింబాబ్వే ఫీల్డింగ్‌ అత్యంత పేలవం.

భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) బెనెట్‌ (బి) రజా 36; శుభ్‌మన్‌ గిల్‌ (సి) రజా (బి) ముజరబాని 66; అభిషేక్‌ శర్మ (సి) మరుమాని (బి) రజా 10; రుతురాజ్‌ (సి) మధెవెర్‌ (బి) ముజరబాని 49; సంజు శాంసన్‌ నాటౌట్‌ 12; రింకు సింగ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 8
మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182;
వికెట్ల పతనం: 1-67, 2-81, 3-153, 4-177;
బౌలింగ్‌: బెనెట్‌ 1-0-15-0; ఎంగర్వ 4-0-39-0; చటార 3-0-30-0; ముజరబాని 4-0-25-2; సికందర్‌ రజా 4-0-24-2; మసకద్జ 3-0-25-0; మధెవెర్‌ 1-0-19-0

జింబాబ్వే ఇన్నింగ్స్‌: మధెవెర్‌ (సి) అభిషేక్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 1; మరుమాని (సి) దూబె (బి) ఖలీల్‌ 13; బెనెట్‌ (సి) బిష్ణోయ్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 4; మైయర్స్‌ నాటౌట్‌ 65; సికందర్‌ రజా (సి) రింకు (బి) సుందర్‌ 15; క్యాంప్‌బెల్‌ (సి) పరాగ్‌ (బి) సుందర్‌ 1; మడాండె (సి) రింకు (బి) సుందర్‌ 37; మసకద్జ నాటౌట్‌ 18; ఎక్స్‌ట్రాలు 5
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159;
వికెట్ల పతనం: 1-9, 2-19, 3-19, 4-37, 5-39, 6-116;
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-15-1, అవేష్‌ ఖాన్‌ 4-0-39-2; రవి బిష్ణోయ్‌ 4-0-37-0; సుందర్‌ 4-0-15-3; అభిషేక్‌ శర్మ 2-0-23-0; శివమ్‌ దూబె 2-0-27-0 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని