Virat Kohli: నాడు సచిన్‌.. నేడు కోహ్లీ ఇలానే..!

సచిన్‌ టెండూల్కర్‌ 100వ సెంచరీ పూర్తి చేసిన సందర్భంగా 2012లో భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అందులో బాలీవుడ్‌, క్రికెట్

Updated : 16 Dec 2021 04:32 IST

 ఏడాదిలో తానేమిటో నిరూపించుకున్న లిటిల్‌ మాస్టర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

సచిన్‌ టెండూల్కర్‌ 100వ సెంచరీ పూర్తి చేసిన సందర్భంగా 2012లో భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అందులో బాలీవుడ్‌, క్రికెట్ నుంచి హేమాహేమీలు పాల్గొన్నారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేయడం కష్టమే కాదు.. అసాధ్యం.. ఇది డాన్‌ చెప్పట్లేదు.. నేను చెబుతున్నాను. మీ 100 సెంచరీల రికార్డును ఎవరు బ్రేక్‌ చేస్తారనుకుంటున్నారు?.. ఎవరూ చేయలేరని చెప్పండి..!’’ అని సచిన్‌ను ప్రశ్నించారు. దీనికి సచిన్‌ నవ్వుతూ ‘‘ఈ గదిలోనే ఉన్నారు.. వారు విరాట్‌, రోహిత్‌..! ఎవరైనా భారతీయులు నా రికార్డు బద్దలు కొడితే సంతోషిస్తాను’’ అని పేర్కొన్నారు. అక్కడి సీన్‌ కట్‌ చేస్తే..

కాలచక్రం గిర్రున తిరిగింది. సచిన్‌ అంచనాలు నిజమయ్యే పరిస్థితి వచ్చింది. విరాట్‌, రోహిత్‌లు పోటీలు పడి పలు రికార్డులు బద్దలు కొట్టారు.  విరాట్‌ కోహ్లీ మైదానంలో చిరుతలా  కదులుతాడు.. రోహిత్‌  కొంచెం బద్దకంగా కనిపించినా బంతిని అలవోకగా స్టాండ్స్‌ దాటించడంలో దిట్ట. ప్రస్తుత వన్డే జట్టులో అధిక శతకాలు విరాట్‌ పేరిట ఉంటే.. అత్యధికంగా మూడు ‘ద్విశతకాలు’ రోహిత్‌ సాధించాడు. ప్రతిభలో ఎవరికెవరూ తీసిపోరు. ప్రస్తుతం టీమిండియాకు వీరు మూలస్తంభాలు. కానీ, ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు గత కొన్ని నెలలుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఆజ్యం పోసేట్లు తాజాగా ఒకరి కెప్టెన్సీలో ఆడేందుకు మరొకరు ఇష్టపడక జట్టు నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. భారత క్రికెట్‌లో ఇలాంటి ప్రచారాలు కొత్తేమీ కాదు. గతంలో సునీల్‌ గావాస్కర్‌-కపిల్‌దేవ్‌, గంగూలీ-ద్రవిడ్‌, ధోనీ-సెహ్వాగ్‌ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్లు బలమైన ప్రచారం జరిగింది. 

బీసీసీఐ ట్వీట్లతో ఊహాగానాలకు ఊతం..!

విరాట్‌-రోహిత్‌ మధ్య పొసగడంలేదనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. 2007లో రోహిత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టగా.. ఆ మరుసటి సంవత్సరమే కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దశాబ్దం పాటు వీరు రికార్డుల హోరుతో భారత్‌ క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించారు. పరస్పరం వ్యతిరేకంగా ఒక్క విమర్శ లేదా ప్రకటన చేసిన దాఖలాలు లేవు. రోహిత్‌ టీమిండియాకు దొరికిన ఓ వరమని అంగీకరించడంలో కోహ్లీ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. వీరిద్దరు కొన్నేళ్లుగా కలిసి ఆడారు. ఈ నేపథ్యంలో  ఒక్క వివాదాస్పద ఘటన కూడా చోటుచేసుకోలేదు.

పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత వైదొలగుతానని కోహ్లీ సెప్టెంబర్‌లోనే బాంబుపేల్చాడు. విరాట్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో బీసీసీఐ వెంటనే ప్రకటించలేదు. కానీ, న్యూజిలాండ్‌తో 3మ్యాచ్‌ల సిరీస్‌కు రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చింది. ఈ సిరీస్‌కు విరాట్‌ విశ్రాంతి తీసుకొన్నాడు. తొలి టెస్టులో కూడా ఆడలేదు. భారత్‌ ఈ సిరీస్‌లో విజయం సాధించింది. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో రహానేను కొనసాగించినా.. అతడిని వైస్‌ కెప్టెన్‌గా పక్కనపెట్టారు. ఆ స్థానంలో రోహిత్‌ను నియమించారు. టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ను కొనసాగించారు. కానీ, ఒక్క నిమిషం తర్వాత బీసీసీఐ చేసిన ట్వీట్‌ పుకార్లకు ఆజ్యం పోసింది. టీ20, వన్డే సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమిస్తన్నట్లు దానిలో ప్రకటించింది.

అప్పటికి కొన్నాళ్ల క్రితమే వన్డే, సుదీర్ఘ ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతానని సోషల్‌ మీడియాలో విరాట్‌ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడిని తొలగించినట్లు ప్రకటించింది. వన్డే కెప్టెన్సీపై ఆసక్తిగా ఉన్నా.. కోహ్లీని బలవంతంగా తొలగించినట్లు ప్రచారం ఊపందుకోవడంతో కొన్ని గంటల్లోనే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. విరాట్‌ను టీ20 ఫార్మాట్లో కొనసాగాలని కోరానని.. సెలక్టర్లు రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను కోరుకోవడంలేదని వెల్లడించినట్లు వివరణ ఇచ్చాడు. వన్డే కెప్టెన్సీ వదులుకోవడానికి విరాట్‌కు 48గంటల సమయం ఇచ్చి.. ఆ తర్వాత ఒక ట్వీట్‌తో తొలగించారనే ప్రచారం జరిగింది. అయితే అప్పుడు విరాట్‌ వైపు నుంచి ఎటువంటి వివరణ రాలేదు.

మరోవైపు వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 13వ తేదీన బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ మాజీ కెప్టెన్‌ విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. భవిష్యత్తులో టీమ్‌ ఇండియా ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించేందుకు కృషి చేస్తుందన్నాడు. అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌ వైస్‌ కెప్టెన్‌ బాధ్యతల్లో ఉన్న రోహిత్‌.. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టులకు అందుబాటులో ఉండటంలేదన్న విషయం బయటకొచ్చింది. ఇది జరిగిన మర్నాడే విరాట్‌ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడనే ప్రచారం మొదలైంది.  విరాట్‌, రోహిత్‌లు నిజమైన కారణాలతో సిరీస్‌కు దూరమైనా.. ప్రస్తుత పరిస్థితులు పుకార్లకు అవకాశం ఇస్తున్నాయని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ పేర్కొన్నారు. చిన్న విషయాలను భూతద్దంలో చూస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. జెంటిల్మెన్‌ గేమ్‌గా పేరున్న క్రికెట్‌లో ఇలాంటి వివాదాలను ముగించేలా అటు బీసీసీఐగానీ, ఇటు ఆటగాళ్లు కానీ ప్రకటన చేయడం ఉత్తమం. తాజాగా కోహ్లీ కూడా అదే చేశాడు. రోహిత్‌ను మెచ్చుకుంటూ.. వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. టెస్టుజట్టు ఎంపికకు కేవలం గంటన్నర ముందు మాత్రమే వన్డే నాయకత్వం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారని తెలిపాడు.  

రెండున్న దశాబ్దాల క్రితం సచిన్‌ కూడా ఇలానే..

దాదాపు రెండున్న దశాబ్దాల క్రితం 1997లో సచిన్‌ను కూడా బీసీసీఐ అర్ధాంతరంగా నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించింది. దీనిని సచిన్‌ అవమానకరంగా భావించాడు. ‘‘నన్ను కెప్టెన్‌గా తొలగించినప్పుడు బీసీసీఐ నుంచి ఎవరూ సంప్రదించలేదు.. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. మీడియా మిత్రుడు ఒకరు కాల్‌ చేసి నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు వెల్లడించారు’’ అని తన జీవిత చరిత్ర ‘ప్లేయింగ్‌ ఇట్‌ మై వే’లో సచిన్‌ గుర్తు చేసుకొన్నారు. ఈ ఘటనను సచిన్‌ చాలా అవమానకరంగా భావించాడు. కానీ, క్రికెట్‌లో లిటిల్‌ మాస్టర్‌ది భిన్నమైన శైలి. వివాదాలకు.. పుకార్లకు దూరంగా ఉంటాడు. భావోద్వేగాలను ఆటపై పడనీయడు. కెప్టెన్సీ తొలగింపు తర్వాత బాగా ఆడాలనుకుని  మాస్టర్‌ బ్లాస్టర్‌ నిశ్చయించుకొన్నాడు. ఆ ఫలితమే..
1998లో టెస్టులు, వన్డేల్లో కలిపి ఏకంగా డజను శతకాలు చేసి తానేమిటో ప్రపంచానికి చాటాడు. తన రికార్డులు బద్దలు కొట్టగలరని సచిన్‌ విశ్వసించిన విరాట్‌-రోహిత్‌లు కెప్టెన్సీ విషయంలో అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ సగటు అభిమానికి తమ ఆట తీరుతో కనువిందు చేయాలి.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని