NZ vs IND: ‘ఛీ ఛీ.. ఇవేం సీట్లు..’ వెల్లింగ్టన్‌ స్టేడియం నిర్వాహకులపై సైమన్‌ డౌల్‌ ఆగ్రహం

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.

Published : 20 Nov 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ అయినా నిర్వహించేందుకు వీలుపడుతుందేమోనని భావించినా.. వర్షం ఆగకపోవడంతో టాస్‌ వేయకుండానే మ్యాచ్‌ రద్దు చేశారు.  ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్‌ రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. మ్యాచ్‌ కోసం స్టేడియంలో సరైన ఏర్పాట్లు చేయలేదంటూ న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్, ఆ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా ఉన్న సైమన్‌ డౌల్‌ స్టేడియం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫొటోని ట్వీట్‌ చేశాడు. దుమ్ముతో మురికి పట్టి ఉన్న కుర్చీలను ఓ వస్త్రంతో తుడిచి దాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ స్టేడియం సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశాడు. 

‘ఇప్పుడే నేను మా కామెంటరీ ఏరియాలోని దుమ్ము పట్టి ఉన్న సీట్లను శుభ్రం చేశా. ఇప్పుడు మా విదేశీ అతిథులు దర్జాగా ఆ కుర్చీల్లో కూర్చోవచ్చు. స్కై స్టేడియం నిర్వాహకులు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. నిజంగా ఇది సిగ్గు చేటు’ అని సైమన్‌ డౌల్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, ఆదివారం మౌంట్‌ మంగనుయ్‌ వేదికగా కివీస్‌, భారత్‌ మధ్య రెండో టీ20 జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని