Dhoni - Raina: ధోనీ విశ్వాసాన్ని సురేశ్‌ రైనా కోల్పోయాడు: మాజీ బౌలర్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా.. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ విశ్వాసాన్ని కోల్పోయాడని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సైమన్‌ డౌల్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 17 Feb 2022 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా.. ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ విశ్వాసాన్ని కోల్పోయాడని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సైమన్‌ డౌల్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో రైనాను ఏ జట్టూ కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. దీంతో అతడి కెరీర్‌ పూర్తిగా ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడిని ఎవరూ ఎంపిక చేసుకోకపోవడంపై స్పందించిన సైమన్‌ అందుకు పలు కారణాలున్నాయని చెప్పాడు. అందువల్లే చెన్నైతో సహా ఇతర ఫ్రాంఛైజీలు రైనాపై ఆసక్తి చూపలేదన్నాడు.

‘‘వేలంలో రైనాను ఎవరూ కొనుగోలు చేయకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూఏఈలో అతడు చెన్నై జట్టు విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆ విషయంలో అసలేం జరిగిందనేది మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. రైనా జట్టుతో పాటు.. కెప్టెన్‌ ధోనీ నమ్మకాన్నీ కోల్పోయాడు. ఎవరి విషయంలోనైనా ఒక్కసారి అలా జరిగితే.. ఇక తిరిగి జట్టులోకి రావడం అసాధ్యం’ అని సైమన్‌ ఓ క్రీడా ఛానెల్‌తో చెప్పాడు. కాగా, సురేశ్‌ రైనా ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ నుంచీ చెన్నై జట్టులోనే ఉన్నాడు. 2016, 17 సీజన్లలో ఆ జట్టు నిషేధానికి గురైనప్పుడు మాత్రం గుజరాత్‌ లయన్స్ తరఫున ఆడాడు. అయితే, 2020లో వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమైన రైనా.. గతేడాది తిరిగి జట్టులో చేరి ఆడినా పెద్దగా స్కోర్లు సాధించలేకపోయాడు. మరోవైపు అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలకడంతో సరైన ఫిట్‌నెస్‌ లేడనే కారణంతో సీఎస్కే ఈ సారి వదిలేసిందని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ ఇటీవల వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని