P V Sindhu : జర్మన్‌ ఓపెన్‌.. రెండో రౌండ్‌లోకి ప్రవేశించిన సింధు, శ్రీకాంత్‌

జర్మనీలో జరుగుతున్న జర్మన్ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌ శుభారంభం చేసింది. భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ రెండో రౌండ్‌లోకి..

Published : 08 Mar 2022 23:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీలో జరుగుతున్న జర్మన్ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌ శుభారంభం చేసింది. భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మ్యాచులో ఏడో సీడ్ సింధు.. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌పై 21-8, 21-7 వరుస సెట్లలో విజయం సాధించింది. 32 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచులో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించింది. ప్రత్యర్థి బుసానన్‌ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బుసానన్‌పై సింధుకి ఇది 15వ విజయం కావడం గమనార్హం. సింధు తన తర్వాతి మ్యాచులో స్పెయిన్‌కి చెందిన బియట్రిజ్‌ కొరలెస్‌తో గానీ, చైనాకు చెందిన ఝాంగ్‌ యి మన్‌తో గానీ తలపడే అవకాశం ఉంది.

ఎనిమిదో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్ మరో మ్యాచులో ఫ్రాన్స్‌కు చెందిన ప్రత్యర్థి బ్రైస్‌ లావెర్డెజ్‌ని ఓడించాడు. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచులో శ్రీకాంత్ 21-10, 13-21, 21-7 తేడాతో గెలుపొందాడు. తొలి సెట్లో వెనుకబడిన లావెర్డెజ్‌.. రెండో సెట్లో గొప్పగా పుంజుకుని శ్రీకాంత్‌పై పై చేయి సాధించాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో శ్రీకాంత్‌ మునుపటి లయను అందుకుని విజయం సాధించాడు. లావెర్డెజ్‌పై శ్రీకాంత్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. తర్వాతి మ్యాచులో చైనాకు చెందిన లు గ్వాగ్ జుతో శ్రీకాంత్ తలపడనున్నాడు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీకి తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. కె.సాయి ప్రతీక్, ఎన్. సిక్కి రెడ్డి జోడీ ఆరంభ మ్యాచులో టాప్ సీడ్‌ డెచాపోల్, సప్సిరీ జంటపై 19-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని