IND vs BAN: అలా అయితేనే భారత్‌కు మద్దతిస్తా: ‘బెస్ట్‌ ఫీల్డర్’ మెడల్‌ అందజేసిన వివ్‌ రిచర్డ్స్‌

టీమ్‌ఇండియా ఆటగాళ్లపై క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. విండీస్‌-యూఎస్‌ఏ ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ అద్భుతంగా ఆడుతోందని అభినందించాడు.

Updated : 23 Jun 2024 14:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8 పోరులో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్రతి మ్యాచ్‌ సందర్భంగా ‘బెస్ట్‌ ఫీల్డర్’ అవార్డును అందజేయడం ఆనవాయితీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు ఓ దిగ్గజ క్రికెటర్ అతిథిగా రావడం విశేషం. వివ్‌ రిచర్డ్స్‌ చేతుల మీదుగా ఈ మెడల్‌ను ఎవరు అందుకున్నారంటే? 

‘‘బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సవాల్‌ ఎదురైంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఎఫెర్ట్స్‌ పెట్టారు. చివరి వరకూ పట్టు వదల్లేదు. క్యాచ్‌లను అందుకోవడమే కాకుండా మైదానంలో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు మెడల్‌ కోసం ముగ్గురు (సూర్యకుమార్‌ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ, అక్షర్ పటేల్) పోటీ పడ్డారు’’ అని భారత ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌ తెలిపాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వివ్‌ రిచర్డ్స్‌ రావడంతో భారత క్రికెటర్లు సాదరంగా స్వాగతం పలికారు. సూర్యకుమార్‌ యాదవ్‌కు రిచర్డ్స్‌ మెడల్‌ను అందజేశాడు. ‘‘ఫీల్డింగ్‌లో మాకు సిరాజ్‌ ఆదర్శం. అద్భుతమైన నైపుణ్యం అతడి సొంతం. తొలి మ్యాచ్‌లోనే అతడు ఒక బెంచ్‌మార్క్‌ పెట్టాడు. ఇలాంటి మెడల్‌ తప్పకుండా మరింత స్ఫూర్తిగా నిలుస్తుంది. సంతోషంగా ఉన్నా’’ అని సూర్య తెలిపాడు. మెడల్‌ను అందించిన తర్వాత వివ్‌ రిచర్డ్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అద్భుతంగా ఆడుతున్నారు: రిచర్డ్స్

‘‘మీ అందరికి శుభాకాంక్షలు. చాలా బాగా ఆడారు. అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించారు. జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఒకవేళ (నవ్వుతూ) విండీస్‌ రేసులో లేకపోతే నేను మీకే మద్దతుగా నిలుస్తా. రిషభ్‌ పంత్‌ను ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. గడ్డు పరిస్థితిని ఎదుర్కొని మరీ వచ్చావు. ఇంతటి టాలెంట్‌ను కొద్దికాలం మిస్‌ అయ్యాం. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరతావు’’ అని రిచర్డ్స్‌ వ్యాఖ్యానించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని