Sachin - Siraj : సచిన్‌ మాటలు ఎంతో స్ఫూర్తి... దేశం కోసం ఎప్పుడూ సిద్ధమే: సిరాజ్‌

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ మాటలు ఎంతో ప్రేరణగా నిలుస్తాయని...

Published : 23 Dec 2021 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ మాటలు ఎంతో ప్రేరణగా నిలుస్తాయని టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ మహమ్మద్ సిరాజ్‌ తెలిపాడు. వాటిని గుర్తు పెట్టుకుని ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాల కోసం అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని ఈ హైదరాబాదీ కుర్రాడు హామీనిచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న తరుణంలో సచిన్‌ నుంచి ప్రశంసలు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని సిరాజ్‌ చెప్పాడు. ‘‘ధన్యవాదాలు సచిన్‌ సర్. ఇటువంటి సమయంలో మీ మాటలు ఎంతో స్పూర్తినిస్తాయి. మన దేశం కోసం ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే కృషి చేస్తా. స్టే వెల్‌ సర్’’ అంటూ సిరాజ్‌ ట్వీట్ చేశాడు. 

సచిన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌ ఎనర్జీ నన్నెంతో ఆకట్టుకుంది. బౌలింగ్‌ చేసేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్, బంతిని సరైన లెంగ్త్‌లో వేయాలనే కసి బాగుంటుంది. మొదటి నుంచి చివరి ఓవర్‌ వరకు అదే ఎనర్జీతో ఉంటాడు. సిరాజ్‌ చాలా వేగంగా నేర్చుకునే తత్వం కలిగిన ఆటగాడు. ఆసీస్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ ఎంతో పరిణతి కలిగిన ప్లేయర్‌గా రాణించాడు. అసలు అతడికది తొలి మ్యాచ్‌ అనుకోం. బౌలింగ్‌ స్పెల్స్‌ను చాలా బాగా మార్చుకున్నాడు. నాకు తెలిసి అతడు అప్పటి నుంచి కెరీర్‌పరంగా వెనుదిరిగి చూడలేదు. నేను ప్రతిసారి గమనించిప్పుడు బౌలింగ్‌లో ఏదొక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు’’ అని సిరాజ్‌ను అభినందించాడు. దానికి సమాధానంగా ట్విటర్‌ వేదికగా సిరాజ్‌ స్పందించాడు. మరోవైపు బుమ్రా, షమీ, ఇషాంత్‌ ఫిట్‌గా ఉండి ఫామ్‌లో ఉంటే సిరాజ్‌కు తుది జట్టులో స్థానం దక్కడం ప్రస్తుతమైతే కాస్త కష్టమే. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సిరాజ్‌ సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు