
Tokyo Olympics: ఆ 30 సెకన్లు మాస్క్ తీయొచ్చు
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్నా.. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తోంది ఐవోసీ. అయితే, కొవిడ్ నిబంధనలో భాగంగా అథ్లెట్లు కచ్చితంగా మాస్కులు ధరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పతకాలు అందుకుంటున్న సమయంలోనూ మాస్క్ ధరిస్తుండటంతో విజేతల ముఖాల్లో ఆనందాన్ని కెమెరాలు బంధించలేకపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఐవోసీ.. నిబంధనలో చిన్న సవరణ చేసింది. క్రీడాకారులు 30 సెకన్లు మాస్క్ తీయడానికి అనుమతిచ్చింది.
అథ్లెట్లు శ్రమించేదల్లా.. పతకం గెలిచి విజయగర్వంతో చిరుదరహాసం చిందించేందుకే. అలాంటి సంతోషకరమైన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఫొటోలు తీసుకుందామనుకున్నవారికి మాస్క్‌లు తప్పక ధరించాలన్న నిబంధన ఇబ్బందికరంగా మారింది. ఒలింపిక్స్ రెండో రోజు భారత అథ్లెట్ మీరాబాయి చాను కూడా రజత పతకాన్ని అందుకున్న సమయంలో మాస్క్ ధరించే ఫొటోలకు పోజిచ్చింది. ఈ అంశం ఐవోసీ దృష్టికి వెళ్లడంతో నిబంధనలో సవరణ చేస్తూ ఆదివారం నుంచి కొత్త నిబంధనను అమలుచేస్తోంది. పోటీల్లో విజేతలు పోడియం వద్ద పతకం అందుకునే సమయంలో 30 సెకన్ల పాటు మాస్క్‌ను తొలగించి ఫొటోలకు పోజులివ్వొచ్చని పేర్కొంది. అథ్లెట్ల కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలివేనని.. అందుకే నిబంధనను సవరిస్తున్నట్లు ఐవోసీ తెలిపింది.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఒలింపిక్స్ విజేతలకు పతకాలు ప్రదానం చేయడంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియంలో పతకాల ప్రదాన కార్యక్రమం జరుగుతోంది. నిర్వాహకులు పతకాలను అథ్లెట్ల మెడలో వేయకుండా ట్రేలో తీసుకొచ్చి వారికి ఇస్తున్నారు. అథ్లెట్లే పతకాలను తీసుకొని స్వయంగా మెడలో వేసుకోవాలి. కరచాలనం, ఆలింగనాలు నిషేధం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.