T20 world cup 2024: ‘చిన్న’ దెబ్బ.. ‘పెద్ద’ గాయం

టీ20 ప్రపంచకప్‌ 2024లో మూడు పెద్ద జట్లు కనీసం తొలి రౌండ్‌ను అధిగమించకపోగా చిన్న జట్లు ముందుకెళ్లి సంచలనం సృష్టించాయి!

Published : 17 Jun 2024 17:05 IST

20 జట్లతో టీ20 ప్రపంచకప్‌ మొదలవుతుంది అనగానే సూపర్‌-8 చేరే జట్లేవో అభిమానులు ముందే ఊహించుకుని ఉంటారు. ఎందుకంటే లీగ్‌ దశలో ఉన్న పసికూనలను చూస్తే పెద్ద జట్లు తేలిగ్గా ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌ చేరతాయని అనిపించింది. కానీ అనూహ్యంగా మూడు పెద్ద జట్లు కనీసం తొలి రౌండ్‌ను అధిగమించకపోగా చిన్న జట్లు ముందుకెళ్లి సంచలనం సృష్టించాయి! అలా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన జట్లు న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక అయితే.. అనూహ్య విజయాలతో తొలిసారి ఓ మెగా టోర్నీలో రెండో రౌండ్‌ చేరిన జట్లు అఫ్గానిస్థాన్, అమెరికా.

కివీస్‌ అనూహ్యంగా..

ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే పాకిస్థాన్, శ్రీలంక వెనుదిరగడం కంటే న్యూజిలాండ్‌ ఇంటి ముఖం పట్టడమే అన్నిటికంటే పెద్ద షాక్‌. ఐసీసీ టోర్నీ అంటే ఏదో పూనకం వచ్చినట్లు ఆడేసే న్యూజిలాండ్‌ ఈసారి అనూహ్యంగా చతికిలబడింది. ప్రపంచకప్‌లో ఎంతో బలమైన రికార్డు ఉన్న కివీస్‌ స్థాయికి తగ్గ ప్రదర్ళనే చేయలేదు. టోర్నీ ఏదైనా కనీసం నాకౌట్‌కు వెళ్లే న్యూజిలాండ్‌ ఈసారి పసికూన మాదిరిగా ఆడింది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచే ఇందుకు ఉదాహరణ. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండి కూడా తనతో పోల్చుకుంటే బలహీనమైన అఫ్గాన్‌ చేతిలో కివీస్‌ 75 పరుగులకే ఆలౌటై ఆ పై ఓడిపోవడం ఈ టోర్నీలోనే పెద్ద సంచలనం. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే తగిలిన ఈ దెబ్బ న్యూజిలాండ్‌ను కోలుకోనీయకుండా చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ చేతిలోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. బౌలింగ్‌లో గొప్పగా రాణించినా.. ఆఖర్లో పట్టు విడిచి పరుగులు ఇచ్చేయడం ఆ జట్టును ముంచింది. రుథర్‌ఫర్డ్‌ ఎడాపెడా బాది విండీస్‌కు పోరాడే స్కోరు సాధించిపెట్టగా.. ఆ తర్వాత కరీబియన్‌ జట్టు  తెలివిగా బౌలింగ్‌ చేసి కివీస్‌ను కట్టడి చేసింది. ఈ ఓటమే ఆ జట్టుకు సూపర్‌-8 అవకాశాలను క్లిష్టం చేసింది. గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో తన ముద్ర వేస్తూ వచ్చిన అఫ్గాన్‌.. ఓ పెద్ద టోర్నీలో తొలిసారి రెండో రౌండ్లోకి దూసుకెళ్లి సత్తా చాటింది.

ఆ రెండూ కూడా!

ఇక సంచలనాలకు మారుపేరైన పాకిస్థాన్‌.. ఓ మాదిరి బలమైన జట్టయిన శ్రీలంక నిష్క్రమించడం కూడా షాకే. ఆతిథ్య అమెరికా చేతిలో ఓడిపోయి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి భారత్‌కు తలొంచి టోర్నీలో ముందుకెళ్లే అవకాశాలను దెబ్బ తీసుకుంది. ఆ తర్వాత కెనడాపై గెలిచి అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కానీ అమెరికా-ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో అమెరికా ముందంజ వేసి పాక్‌ను దెబ్బ కొట్టింది. దీంతో తొలి రౌండ్లోనే ఈ మాజీ ఛాంపియన్‌ ఇంటిముఖం పట్టింది. ఇక శ్రీలంక కూడా కూడా పాక్‌ మాదిరే ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొదట దక్షిణాఫ్రికా, తర్వాత బంగ్లాదేశ్‌ చేతిలో ఓడడం ఆ జట్టు సూపర్‌-8 అవకాశాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత నేపాల్‌తో పోరు వర్షం కారణంగా రద్దవడంతో లంక ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం ఆ జట్టును దెబ్బ తీసింది. దక్షిణాఫ్రికాపై 77 పరుగులకే ఆలౌటైన లంక.. బంగ్లాపై 124 పరుగులే చేయగలిగింది. ఈ వైఫల్యం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. ఈ టోర్నీలో ముందుకు వెళ్లలేకపోయినా పాపువా న్యూగినీ, నేపాల్‌ జట్లు కూడా తక్కువేం కాదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టు చేతిలో నేపాల్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడి తన సత్తా ఏంటో చాటింది. మున్ముందు టోర్నీల్లో ఈ కూనలతో పెద్ద జట్లు జాగ్రత్తగా ఉండక తప్పదు అని ఈ టీ20 ప్రపంచకప్‌ ద్వారా నిరూపితమైంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని