Women criket: స్మృతి శతకం

భారత మహిళల క్రికెట్‌ జట్టుకు అదిరే విజయం! స్మృతి మంధాన శతకం..బంతితో శోభన, దీప్తి విజృంభణతో హర్మన్‌ప్రీత్‌ బృందం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది.

Published : 17 Jun 2024 03:46 IST

భారత మహిళల విజయం
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే
బెంగళూరు

భారత మహిళల క్రికెట్‌ జట్టుకు అదిరే విజయం! స్మృతి మంధాన శతకం.. బంతితో శోభన, దీప్తి విజృంభణతో హర్మన్‌ప్రీత్‌ బృందం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. ఆదివారం తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో సఫారీ జట్టును చిత్తు చేసింది. మొదట భారత్‌ 8 వికెట్లకు 265 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (117; 127 బంతుల్లో 12×4, 1×6) సెంచరీతో మెరిసింది. ఆశ శోభన (4/21), దీప్తిశర్మ (2/10) విజృంభించడంతో ఛేదనలో దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో 122కే ఆలౌటైంది. సన్‌ లజ్‌ (33) టాప్‌ స్కోరర్‌. 

తిప్పేసిన శోభన: ఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి దక్షిణాఫ్రికా విలవిల్లాడింది. ముఖ్యంగా లెగ్‌స్పిన్నర్‌ ఆశ శోభన ఆ జట్టును గట్టి దెబ్బ కొట్టింది. అయితే పేసర్‌ రేణుక సింగ్‌ తొలి ఓవర్లో వోల్వార్ట్‌ (4)ను ఔట్‌ చేసి ఆ జట్టు పతనాన్ని మొదలుపెట్టింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 6 ఓవర్లలో 21/2తో సఫారీ జట్టు ఇబ్బందుల్లో పడింది. మరిజేన్‌ కాప్‌ (24), సన్‌ లజ్‌ నిలిచినా.. ఇన్నింగ్స్‌ మాత్రం వేగాన్ని అందుకోలేదు. 21 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 3 వికెట్లకు 71 పరుగులు మాత్రమే. ఈ దశలో శోభన విజృంభించడంతో సఫారీ జట్టు మరింత కష్టాల్లో కూరుకుపోయింది. శోభనతో పాటు దీప్తిశర్మ, రాధ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా పతనం వేగంగా సాగింది. చివర్లో జాఫ్టా (27 నాటౌట్‌) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. 

నిలిచిన మంధాన: అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్‌ బృందం ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్‌ షెఫాలి వర్మ (7), హేమలత (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ స్థితిలో మంధాన నిలిచింది. మొదట హర్మన్‌ (10).. ఆపై జెమీమా రోడ్రిగ్స్‌ (17)తో కలిసి స్కోరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ హర్మన్, జెమీమాతో పాటు రిచా (3) కూడా ఔట్‌ కావడంతో భారత్‌ 99/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తిశర్మ (37)తో కలిసి స్మృతి ఇన్నింగ్స్‌ నిలబెట్టింది. ఆఫ్‌సైడ్‌ చక్కని షాట్లు ఆడిన స్మృతి.. 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఈ జంట ఆరో వికెట్‌కు 81 పరుగులు జత చేయడంతో భారత్‌ 37 ఓవర్లకు 180/5తో కోలుకుంది. దీప్తి వెనుదిరిగినా.. పూజ వస్త్రాకర్‌ (31 నాటౌట్‌)తో కలిసి స్మృతి స్కోరు పెంచింది. ఈ క్రమంలోనే క్లాస్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌తో 99కి చేరుకున్న ఈ స్టార్‌ బ్యాటర్‌.. వెంటనే సింగిల్‌ తీసి సెంచరీ మార్కు అందుకుంది. శతకం తర్వాత ధాటిగా ఆడే క్రమంలో స్మృతి ఔటైనా.. పూజ స్కోరును 260 దాటించింది. 

భారత్‌ ఇన్నింగ్స్‌: షెఫాలివర్మ (సి) జాఫ్టా (భి) క్లాస్‌ 7; స్మృతి మంధాన (సి) లజ్‌ (బి) క్లాస్‌ 117; హేమలత (సి) షాన్‌గాజ్‌ (బి) ఎంలబా 12; హర్మన్‌ప్రీత్‌ (సి) వాల్వార్డ్‌ (బి) డెరిక్‌సన్‌ 10; జెమీమా (సి) కాప్‌ (బి) షాన్‌గాజ్‌ 17; రిచా ఘోష్‌ (సి) జాఫ్టా (బి) ఖాకా 3; దీప్తిశర్మ (బి) ఖాకా 37; పూజ నాటౌట్‌ 31; రాధ (సి) ఎంలబా (బి) ఖాకా 6; శోభన నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 265; వికెట్ల పతనం: 1-15, 2-32, 3-55, 4-92, 5-99, 6-180, 7-238, 8-252; బౌలింగ్‌: ఖాకా 10-0-47-3; క్లాస్‌ 10-0-51-2; డెరిక్‌సన్‌ 10-0-60-1; ఎంలబా 8-0-38-1; షాన్‌గాజ్‌ 10-0-54-1; అనెక్‌ 2-0-11-0

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: లారా వోల్వార్డ్‌ (బి) రేణుక 4; బ్రిట్స్‌ (సి) రాధ (బి) దీప్తి 18; అనెక్‌ ఎల్బీ (బి) పూజ 5; సన్‌ లజ్‌ ఎల్బీ (బి) దీప్తి 33; మరిజేన్‌ కాప్‌ (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) శోభన 24; డెరిక్‌సన్‌ రనౌట్‌ 1; షాన్‌గాజ్‌ ఎల్బీ (బి) రాధ 8; జాఫ్టా నాటౌట్‌ 27; క్లాస్‌ (సి) రాధ (బి) శోభన 1; ఎంలబా (బి) శోభన 0; ఖాకా (సి) రిచా (బి) శోభన 0; ఎక్స్‌టాలు 1 మొత్తం: (37.4 ఓవర్లలో ఆలౌట్‌) 122; వికెట్ల పతనం: 1-4, 2-21, 3-33, 4-72, 5-74, 6-92, 7-103, 8-120, 9-120; బౌలింగ్‌: రేణుక 7-0-30-1; పూజ 4-1-11-1; దీప్తిశర్మ 6-0-10-2; రాధ యాదవ్‌ 10-0-32-1; ఆశ శోభన 8.4-2-21-4; హర్మన్‌ప్రీత్‌ 2-0-17-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని