Smriti Mandhana: రిలేషన్‌షిప్‌ను బయటపెట్టిన స్మృతీ మంధాన.. ఎవరీ పలాశ్‌ ముచ్చల్‌..?

మ్యూజిక్‌ కంపోజర్‌ పలాశ్‌ ముచ్చల్‌తో స్టార్‌ క్రికెటర్‌ స్మృతీ మంధాన (Smriti Mandhana) రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తాజాగా వారి ఐదేళ్ల బంధం గురించి ఆమె బయటపెట్టారు. 

Updated : 08 Jul 2024 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అటు ఆటతోనూ, ఇటు అందంతోనూ యువకుల హృదయాలను కొల్లగొడుతుంది టీమ్‌ ఇండియా మహిళల జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన (Smriti Mandhana). తాజాగా ఆమెకు సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్టు చూసి ఆ యువ హృదయాలు ముక్కలయ్యాయి. మ్యూజిక్ కంపోజర్‌ పలాశ్‌ ముచ్చల్‌ (Palash Muchhal)తో ఉన్న ఆమె బంధం అఫీషియల్ కావడమే అందుకు కారణం. తమ ఐదేళ్ల రిలేషన్‌షిప్‌కు గుర్తుగా స్మృతితో కలిసి కేక్‌ కట్‌ చేస్తోన్న ఫొటోలను అతడు షేర్ చేశాడు. ఆ పోస్టుకు ఈ బ్యాటర్‌ కూడా స్పందించారు. ఇక ఆ ఫొటోలను చూడగానే నెటిజన్లు ‘క్యూట్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కొద్దికాలంగా రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఐదేళ్ల బంధాన్ని బయటపెట్టారు. 

ఇంతకీ ఎవరీ పలాశ్‌..?

29 ఏళ్ల పలాశ్ ఒక మ్యూజిక్ కంపోజర్‌. టీ సిరీస్‌, జీ మ్యూజిక్, పాల్‌ మ్యూజిక్‌ కోసం పలు మ్యూజిక్ వీడియోలు చేశాడు. అలాగే రిక్షా (వెబ్‌సిరీస్‌), అర్ధ్‌(సినిమా)కు దర్శకత్వం కూడా వహించాడు. అలాగే ఆశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖేలే హమ్‌ జీ జాన్‌ సే’ లో అభిషేక్ బచ్చన్‌, దీపికా పదుకొణెతో కలిసి నటించాడు. అతడి సోదరి పలక్ ముచ్చల్‌ కూడా బాలీవుడ్‌లో సింగర్‌గా రాణిస్తున్నారు. గతంలో స్మృతి పియానో వాయిస్తోన్న వీడియోను షేర్‌ చేసి.. న్యూ స్టూడెంట్‌ అంటూ పలాశ్‌ రాసుకొచ్చాడు.

తన బ్యాటింగ్‌ మాయాజాలంతో గత దశాబ్దకాలంగా భారత మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న స్మృతి ఓ సందర్భంలో కాబోయేవాడి గురించి మాట్లాడుతూ.. ‘‘పెళ్లనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. కాబోయేవాడు ఎలా ఉండాలో ప్రతీ అమ్మాయీ కలలు కంటుంది. అలా నాకూ కొన్ని కలలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. నన్ను చేసుకోబోయేవాడు మంచి మనసున్నవాడై ఉండాలి. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నా కెరీర్‌ను అర్థం చేసుకోవాలి. కెరీర్‌ బిజీ అయిపోయి కొన్నిసార్లు నేను తనకు సమయం కేటాయించలేకపోవచ్చు. ఈక్రమంలో నన్ను అర్థం చేసుకొని, ప్రోత్సహించేవాడినే మనువాడతా’’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని