Smriti Mandhana: స్మృతి కొద్దిలో.. హ్యాట్రిక్‌ శతకం దూరం

స్మృతి మంధాన (90; 83 బంతుల్లో 11×4) అదరగొట్టింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన ఈ ఓపెనర్‌.. మరో మేటి ఇన్నింగ్స్‌ ఆడడంతో దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో ఘనంగా నెగ్గిన భారత మహిళల జట్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Published : 24 Jun 2024 03:34 IST

దక్షిణాఫ్రికాపై భారత్‌ క్లీన్‌స్వీప్‌ 

బెంగళూరు: స్మృతి మంధాన (90; 83 బంతుల్లో 11×4) అదరగొట్టింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన ఈ ఓపెనర్‌.. మరో మేటి ఇన్నింగ్స్‌ ఆడడంతో దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో ఘనంగా నెగ్గిన భారత మహిళల జట్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం హర్మన్‌ప్రీత్‌ బృందం 6 వికెట్ల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 215/8కే పరిమితమైంది. కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ (61; 57 బంతుల్లో 7×4) టాప్‌ స్కోరర్‌. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీప్తిశర్మ (2/27), అరుంధతి రెడ్డి (2/36) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో స్మృతి మెరుపులతో భారత్‌ 40.4 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (42) రాణించింది. సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 343 పరుగులు చేసిన స్మృతికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది. రెండు జట్ల మధ్య ఏకైక టెస్టు చెన్నైలో శుక్రవారం ఆరంభం కానుంది.

స్మృతి జోరు: తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో అదరగొట్టిన స్మృతి.. మూడో వన్డేలోనూ సత్తా చాటింది. డిక్లెర్క్‌ వేసిన ఆరో ఓవర్లో మూడు బౌండరీలు కొట్టి స్కోరు వేగాన్ని పెంచిన స్మృతి.. ఆ తర్వాతా జోరు కొనసాగించింది. ఆమె తొలి వికెట్‌కు షెఫాలివర్మ (25)తో కలిసి 68 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది. షెఫాలి వెనుదిరిగినా.. ప్రియా పునియా (28).. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌తో కలిసి స్మృతి స్కోరును ముందుకు తీసుకెళ్లింది. హ్యాట్రిక్‌ సెంచరీ చేసేలా కనిపించిన ఆమె.. మాల్బా బౌలింగ్‌లో స్వీప్‌ చేసే ప్రయత్నంలో క్యాచ్‌ ఔట్‌ అయింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ కూడా పెవిలియన్‌ చేరినా.. జెమీమా (19 నాటౌట్‌), రిచా ఘోష్‌ (6 నాటౌట్‌) లాంఛనం పూర్తి చేశారు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా ఆరంభంలో బాగా ఆడి ఆ తర్వాత తడబడింది. అరుంధతి, దీప్తిశర్మ విజృంభించడంతో 41 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోవడంతో సఫారీ జట్టు భారీ స్కోరు ఆశలు గల్లంతయ్యాయి.

దక్షిణాఫ్రికా: 215/8 (లారా వోల్వార్ట్‌ 61, టాజ్మిన్‌ బ్రిట్స్‌ 38; అరుంధతిరెడ్డి 2/36,   దీప్తిశర్మ 2/27); భారత్‌: 220/4 (స్మృతి మంధాన 90, హర్మన్‌ప్రీత్‌ 42)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని