Sehwag-Pant: సెహ్వాగ్‌, రిషభ్‌ పంత్‌ మధ్య పోలికలున్నాయి: పుజారా

టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, రిషభ్ పంత్ (Rishabh Pant) మధ్య చాలా పోలికలున్నాయని టీమ్‌ఇండియా (Team India) టాప్‌ ఆర్డర్ బ్యాటర్ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. 

Published : 07 Feb 2023 22:29 IST

ఇంటర్నెట్ డెస్క్: వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag)‌.. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బౌండరీలతో విరుచుకుపడటం అతడి నైజం. ఇన్నింగ్స్‌లో తొలి బంతిని సైతం స్టాండ్స్‌లోకి పంపించగలిగే సత్తా వీరూ సొంతం. ప్రస్తుతం తరం క్రికెటర్లలో సెహ్వాగ్‌లా ఆడే ఆటగాళ్లు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) గురించి. వన్డేలు, టీ20ల్లో నిలకడగా ఆడే పంత్‌ టెస్టు ఫార్మాట్‌లోకి వచ్చేసరికి మాత్రం రెచ్చిపోతాడు. 2020-21 బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీలోనూ తన దూకుడైన ఆటతీరుతో కంగారులకు వణుకు పుట్టించాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్, పంత్‌లలో కలిసి ఆడిన ఛెతేశ్వర్‌ పుజారా ( Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని పేర్కొన్నాడు. సెహ్వాగ్ మాదిరిగానే పంత్ కూడా తన సహజమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతాడని పుజారా అభిప్రాయపడ్డాడు.    

‘పరిస్థితులు మారాయి. ఎందుకంటే ఈ రోజుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ ఎక్కువగా ఆడుతూ షాట్లు ఆడుతున్నారు. టెస్టు క్రికెట్ విషయానికి వచ్చేసరికి.. సహజమైన ఆటతీరుతోపాటు అప్పుడప్పుడు అటాకింగ్ గేమ్‌ ఆడుతున్నారు. మీరు ఒకసారి వీరేంద్ర సెహ్వాగ్, రిషభ్‌ పంత్‌ని చూడండి. వారిద్దరి మధ్య చాలా పోలికలున్నాయి. నేను వారిద్దరిని పోల్చడానికి ప్రయత్నించడం లేదు. కానీ, టెస్టు క్రికెట్‌లో వారి ఆటతీరు చాలా దగ్గరగా ఉంటుంది. ఇద్దరూ దూకుడైన ఆటగాళ్లే. వారు తమ సామర్థ్యాలపై నమ్మకం ఉంచారు’ అని పుజారా వివరించాడు. ఫిబ్రవరి 9 నుంచి 2022-23 బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy)  ప్రారంభం కానుంది. తొలి టెస్టు నాగ్‌పూర్‌ వేదికగా ప్రారంభం కానుంది. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని