Virat Kohli:‘కోహ్లి కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు కదా.. కొంతమంది అంపైర్లు ప్రశాంతంగా నిద్రపోతారు’

ఈ ఐపీఎల్‌  సీజన్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)ని దురదృష్టం వెంటాడింది. యూఏఈలో రెండో అంచె ఆరంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే తనకు చివరి సీజన్‌ అని విరాట్ కోహ్లి ప్రకటించాడు. దీంతో ఈ సారి కప్పు గెలిచి తీరాల్సిందేనని భావన

Updated : 14 Oct 2021 04:43 IST

(Photo: Royal Challengers Bangalore)

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ ఐపీఎల్‌  సీజన్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)ని దురదృష్టం వెంటాడింది. యూఏఈలో రెండో అంచె ఆరంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే తనకు చివరి సీజన్‌ అని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో ఈ సారి కప్పు గెలిచి తీరాల్సిందేనని భావన అభిమానుల్లో కలిగింది. కోహ్లీ కోసమైనా కప్ కొడతామని కొంతమంది ఆర్‌సీబీ ఆటగాళ్లు కూడా చెప్పారు. అయితే, సోమవారం రాత్రి  షార్జాలో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆర్‌సీబీని 4 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. దాంతో ఆర్‌సీబీ ఐపీఎల్ 2021 నుంచి నిష్క్రమించింది. దీంతో కెప్టెన్‌గా ఆర్‌సీబీకి టైటిల్‌ని అందించాలనుకున్న కోహ్లీకి ఆ కల నెరవేరకుండానే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేయాల్సి వచ్చింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత  భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలోనే కంటతడి పెట్టుకున్నాడు. అతడిని చూసిన ఏబీ డివిలియర్స్ కూడా ఎమోషనల్ అయ్యాడు. దాంతో.. బెంగళూరు జట్టులోని మిగతా ఆటగాళ్లు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కోహ్లీ మాత్రం ఆ బాధని తట్టుకోలేక అలానే కన్నీటితో డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. 

కాగా, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్ వీరేందర్ శ‌ర్మ‌పై కోహ్లి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో  వైర‌ల్‌ అయింది. స‌ద‌రు అంపైర్ ఆర్‌సీబీకి వ్య‌తిరేకంగా ఇచ్చిన కొన్ని నిర్ణ‌యాలు త‌ర్వాత రివ్యూలో ఆర్‌సీబీకి అనుకూలంగా మారాయి. దీనిపై ఆగ్రహాం వ్యక్తం చేయడంలో అర్థముందని స్పష్టమైంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ డివిలియర్స్‌ పరోక్షంగా విరాట్‌ పై సెటైర్ వేశాడు. విరాట్‌  కెప్టెన్సీ ఈ మ్యాచ్‌తో ముగియడంతో జట్టు సభ్యులందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశమైన అతడికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అతని కెప్టెన్సీపై ఏబీ మాట్లాడాడు.‘కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంతో కొంత‌మంది అంపైర్లు ప్రశాంతంగా నిద్ర‌పోతారు’అని చమత్కరించాడు. అదే స‌మ‌యంలో విరాట్‌ని ప్ర‌శంసించాడు. ‘గొప్ప కెప్టెన్సీ కెరీర్ పూర్తి చేసుకున్నందుకు కోహ్లీకి శుభాకాంక్ష‌లు. ఇక మైదానంలోకి స్వేచ్ఛ‌గా వెళ్లి ఆడుతూ ఆర్సీబీకి తొలి ట్రోఫీని, భారత్‌కు మ‌రెన్నో ట్రోఫీలు అందించాలి’డివిలియర్స్‌ ముగించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు